తెలుగుదేశానికి జనసేనకు మధ్య కుదిరిన డీల్ ఏమిటి? ఏయే ఆఫర్లకు ఒప్పుకుని చంద్రబాబు పల్లకీ మోయడానికి పవన్ కల్యాణ్ సిద్ధపడుతున్నారు. అనేది ఎప్పటికీ సస్పెన్స్ గానే ఉండిపోయే వ్యవహారం. అధికారికంగా పొత్తు ప్రకటన వెలువడిన తర్వాత కూడా మహా అయితే ఎన్నెన్ని సీట్లు పంచుకుంటున్నారో లెక్క తేలుతుందే తప్ప.. సీట్ల వెనుక ఎలాంటి డీల్స్ ఉన్నాయో మనకు అర్థం కాదు. అయితే.. ఒక్క బేరం విషయం మాత్రం ఇప్పుడే సంకేతాలు అందుతున్నాయి.
తెలుగుదేశం జనసేన మధ్య పొత్తు కుదిరితే.. ఎన్నికల అనంతరం రాజ్యసభ అవకాశం వచ్చినప్పుడు దానిని జనసేన తరఫునుంచి పవన్ కల్యాణ్ అన్నయ్య నాగేంద్రబాబుకు ఇవ్వాలనేది ఆ డిమాండ్. ఇందుకు చంద్రబాబునాయుడు కూడా సుముఖంగాఅనే సమ్మతి వ్యక్తంచేసినట్లు సమాచారం. మరో రకంగా చూసినప్పుడు చంద్రబాబునాయుడు అంతకంటె గతి లేదు.
పవన్ కల్యాణ్ పొత్తు ద్వారా రాగల లాభం ముందు నిజంగానే తమకు రాజ్యసభకు ఎంపీలను పంపేంత బలం దక్కితే.. ఒక ఎంపీ టును త్యాగం చేయడం పెద్ద సంగతి కానే కాదు. గతంలో కూడా కేవలం వ్యాపార అవసరాలకోసం.. తన పార్టీకి సంబంధంలేని, పార్టీకి సేవ చేసి ఎరగని బయటి వారికి రాజ్యసభ ఎంపీ సీట్లను ధారాదత్తం చేసిన చరిత్ర చంద్రబాబుకు ఉంది. అలాంటిది.. పార్టీ నెగ్గడానికి, వీలైతే అధికారంలోకి రావడానికి ఇంతగా ఉపయోగపడుతున్న పవన్ కల్యాణ్ కోసం ఆయన ఒక ఎంపీసీటును తప్పకుండా ఇస్తారు.
రాబోయే ఎన్నికల్లో పొత్తుల కారణంగా జనసేనకు దక్కే సీట్లు తగ్గుతాయి. ఆ నేపథ్యంలో అన్నయ్య నాగబాబును ఎన్నికలకు దూరంగా ఉంచాలని పవన్ నిర్ణయించారు. ఈ విషయం కొత్తది కాకపోయినప్పటికీ.. కర్నూలు పర్యటన సందర్భంగా నాగబాబు మరోసారి తేల్చిచెప్పారు. రాబోయే ఎన్నికల్లో తాను పోటీచేయడం లేదని ఆయన అన్నారు. గత ఎన్నికల్లో ఎంపీగా బరిలోకి ఆయనకు తలబొప్పి కట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఎన్నికల్లో నేరుగా పోటీచేయకుండా, జనసేన- తెలుగుదేశం కూటమి విజయంకోసం ఆయన పనిచేస్తారు.
ఎన్నికల తర్వాత చంద్రబాబునాయుడు సహకరించి.. ఒక రాజ్యసభ ఎంపీ సీటు ఇస్తారు. అయితే ఎన్నికల్లో నెగ్గి అధికారంలోకి వస్తే మాత్రమే ఈ ఒప్పందానికి విలువ ఉంటుందా? ఎన్నికల్లో మెజారిటీ సీట్లు దక్కి, అధికారంలోకి రాకపోయినా సరే.. చంద్రబాబునాయుడు ఈ వాగ్దానాన్ని గౌరవిస్తారా అనేది వేచిచూడాలి.