యువగళం పేరుతో నారా లోకేశ్ జనంలోకి రాబోతున్నారు. సోషల్ మీడియాకు పరిమితమైన లోకేశ్, పాదయాత్ర చేయాలని సంకల్పించడం సాహసోపేతమే. 400 రోజులు, 4 వేల కిలోమీటర్లు నడవాలని అనుకోవడం చిన్న విషయం కాదు. చంద్రబాబు ఒక్కగానొక్క కుమారుడైన లోకేశ్‌ను అల్లారుముద్దుగా పెంచుకున్నారు. ఎప్పుడూ ఎండా, వాన, చలికి తిరిగిన మనిషికి కాదాయన. చంద్రబాబు కథ వేరు. చంద్రబాబు ఓ సామాన్య కుటుంబంలో పుట్టి, అంచెలంచెలుగా ఎదిగిన నాయకుడు.
బాబుకు తెలియని జీవితం లేదు. కానీ లోకేశ్ విషయానికి వచ్చే సరికి పూర్తి వైరుధ్యం ఉంది. పేదల జీవితం గురించి తెలియడం, దాన్ని అనుభవించడం వేర్వేరు అంశాలు. అందుకే లోకేశ్ పాదయాత్రపై టీడీపీకి ఆందోళన. లోకేశ్ అడుగులు పార్టీని ముందుకు నడిపిస్తాయా? లేక వెనక్కా? అనేది అతి త్వరలో తేలనుంది. జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకతను సొమ్ము చేసుకునే క్రమంలో లోకేశ్ పాదయాత్ర చేస్తున్నారని టీడీపీ చెబుతోంది.
అయితే లోకేశ్ గళం వెనుక ఉద్దేశం వేరే. తన వల్లే టీడీపీ అధికారంలోకి వచ్చిందనే సంకేతాల్ని పంపి, తద్వారా తనకంటూ ఓ కోటను నిర్మించుకోవాలనే తపన ఆయనలో కనిపిస్తోంది. ఇది రాజకీయాల్లో తండ్రి ఉండగానే చేసుకోవాలని లోకేశ్ తపిస్తున్నారు. అందుకే కష్టమైనా, నష్టమైనా పాదయాత్రకు లోకేశ్ శ్రీకారం చుట్టడం. రానున్న ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో లోకేశ్ కీలక పాత్ర పోషించనున్నారు.
టీడీపీలో ఇప్పటికీ చాలా వరకూ చంద్రబాబు కోటరీనే వుంది. వీళ్లంతా లోకేశ్ పాదయాత్ర చేయవద్దని సలహాలిచ్చిన వాళ్లే. లోకేశ్‌పై పప్పు అనే బ్రాండ్ ఇమేజ్‌ను చూపుతూ, ఆయనే జనంలోకి వెళితే పార్టీకి డ్యామేజీ అని చంద్రబాబుకు సీనియర్ నేతలు నూరిపోశారు. అయితే లోకేశ్ పట్టుపట్టడంతో పాదయాత్రను అడ్డుకోలేకపోయారన్నది వాస్తవం. దీంతో ముఖ్యంగా పార్టీలో పట్టు సాధించాలనే పట్టుదల లోకేశ్‌లో పెరిగింది. ఇందుకు ఇదే సరైన సమయం అని ఆయన భావన. టీడీపీ అధికారంలోకి వస్తే అది తన క్రెడిట్‌లోకి పోతుందని లోకేశ్ ఎత్తుగడ వేశారు. ఒకవేళ రాకపోతే తనకు పోయేదేమీ లేదని ఆయన భావన.