ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లా కడపపై టీడీపీ ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడే జగన్‌ను కట్టడి చేయాలనే పట్టుదలతో చంద్రబాబు, లోకేశ్ ఉన్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కడప జిల్లాలో బలమైన అభ్యర్థులను బరిలో దించేందుకు టీడీపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ మేనమామ పి.రవీంద్రనాథ్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కమలాపురం నియోజకవర్గంపై చంద్రబాబు, లోకేశ్ ప్రత్యేక దృష్టి సారించారు.
త్వరలో మాజీ ఎమ్మెల్యే జీ.వీరశివారెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమయ్యారు. మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డితో పాటు తాను టీడీపీలో చేరనున్నట్టు వీరశివారెడ్డి ప్రకటించారు. ఒకవేళ కమలాపురంలో టీడీపీ అభ్యర్థి వీరశివారెడ్డే అయితే మాత్రం రవీంద్రనాథ్‌రెడ్డికి సినిమా కనిపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కమలాపురం నియోజకవర్గం వ్యాప్తంగా వీరశివారెడ్డికి బలమైన అనుచర వర్గం వుంది.
మరోవైపు రెండో దఫా ఎన్నికైన రవీంద్రనాథ్‌రెడ్డిపై సొంత పార్టీ నాయకులు, కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి వుందని సమాచారం. కేవలం వైఎస్సార్, జగన్‌లను చూసి రవీంద్రనాథ్‌రెడ్డికి ఓట్లు వేశామనే వాళ్లే ఎక్కువ. గతంలో ప్రతిపక్షంలో వున్నప్పుడు ఏం చేయలేకపోయారంటే అర్థం చేసుకోవచ్చని, అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎవరికీ ఏం చేయలేరనే ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఇప్పటికీ రవీంద్రనాథ్‌రెడ్డి బలం ప్రత్యర్థి పుత్తా నరసింహారెడ్డే. ఎందుకో గానీ, నరసింహారెడ్డి అంటే కమలాపురం నియోజకవర్గం ప్రజానీకంలో ఒక రకమైన భయం వుంది. పుత్తాతో పోల్చుకుంటే… ఏమీ చేయకపోయినా, కనీసం హాని చేయరనే అభిప్రాయం రవీంద్రనాథ్‌రెడ్డిపై ఉందన్నది వాస్తవం. ఇదే ఆయన్ని రెండోసారి గెలిపించింది.
ఇదే వీరశివారెడ్డి విషయానికి వస్తే బలమైన అభ్యర్థి అవుతారు. 1994లో రాష్ట్రంలో కాంగ్రెస్ అగ్రనాయకుడిగా పేరొందిన డాక్టర్ ఎంవీ మైసూరారెడ్డిని వీరశివారెడ్డి మట్టి కరిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. 1999లో మైసూరా మళ్లీ గెలిచారు. 2004లో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ గాలి వీచినా కమలాపురంలో మాత్రం టీడీపీ అభ్యర్థి వీరశివారెడ్డి గెలుపొంది తన సత్తా ఏంటో చూపారు. ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్‌లో వీరశివారెడ్డి చేరారు. వైఎస్సార్ శిష్యుడైన వీరశివారెడ్డి 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా కమలాపురం నుంచి గెలుపొందారు. వైఎస్సార్ మరణానంతరం రాజకీయాలు మారాయి. వైఎస్ జగన్ పార్టీ పెట్టినప్పటికీ, ఆయన వెంట వీరశివారెడ్డి నడవలేదు. టీడీపీలో చేరారు.
గత ఎన్నికల్లో చివరి రోజు వైసీపీ అభ్యర్థి రవీంద్రనాథ్‌రెడ్డికి మద్దతు ప్రకటించి టీడీపీకి షాక్ ఇచ్చారు. అయితే వైసీపీలో ఆయన ఉన్నా లేనట్టైంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న తరుణంలో వీరాశివారెడ్డి మళ్లీ తెరపైకి వచ్చారు. మూడుసార్లు ఓడిపోయిన వారికి టికెట్లు ఇవ్వమని లోకేశ్ ప్రకటించిన నేపథ్యంలో పుత్తా నరసింహారెడ్డి అభ్యర్థిత్వాన్ని పరిగణలోకి తీసుకోరనే చర్చ నడుస్తోంది. ఇప్పటి వరకూ పుత్తా వరుసగా నాలుగుసార్లు ఓడిపోయారు. దీంతో వీరశివారెడ్డికే అవకాశాలు ఎక్కువనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తానే వచ్చే ఎన్నికల్లో కమలాపురం నుంచి టీడీపీ తరపున పోటీ చేస్తానని ఆయన ప్రకటించడంతో ఒక్కసారిగా స్థానిక రాజకీయాల్లో అలజడి రేగింది. వీరాశివారెడ్డే అభ్యర్థి అయితే ఎలా వుంటుందనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. తరచూ పార్టీలు మారుతారనే చెడ్డపేరు వీరశివాకు ఉంది. అయితే పబ్లిక్ ఫ్రెండ్లీ లీడర్‌గా వీరశివారెడ్డిని జనం గుర్తిస్తారు. ఇదే ఆయనకు కలిసొచ్చే అంశం. వీరశివారెడ్డి టీడీపీ అభ్యర్థి అయితే మాత్రం…. జగన్ మేనమామకు దబిడి దబిడే అనే చర్చ జరుగుతోంది.