ఉద్యోగులు, పెన్షన్‌దారులకు జీతాలు అందించే విషయమై ఏపీ సర్కార్ వింత వాదనకు దిగింది. ప్రతినెలా ఒకటో తారీఖున జీతాలను ప్రభుత్వం చెల్లించలేదని ఈనాడు పత్రిక రాయడమే తప్పని, తాము ఇవ్వకపోవడం ఎంత మాత్రం కాదని ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ వాదనకు దిగడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సకాలంలో ఉద్యోగులు, పెన్షన్‌దారులకు జీతాలు చెల్లించేలా సహకరించాలని, ఈ మేరకు చట్టం తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ గవర్నర్‌ను ఒక ఉద్యోగ సంఘం కోరడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల జీతాలపై చంద్రబాబు అనుకూల పత్రిక ఈనాడు ఓ కథనం రాసింది.
జగన్ సీఎం అయిన తర్వాత ఉద్యోగులకు జీతాలు చెల్లించడమూ కష్టమైపోతోందని ఆ కథనంలో పేర్కొన్నారు. ఒకటో తేదీ అంటే జీతాలు పడే రోజని, జగన్ వచ్చిన తర్వాత అసలు జీతాలు, పింఛన్లు ఎప్పుడొస్తాయో తెలియని కూడా తెలియని దుస్థితిలోకి రాష్ట్రం వెళ్లిందని రామోజీ పత్రిక రాసుకొచ్చింది. ఇలా ఎలా రాస్తావని జగన్ మానస పుత్రిక సాక్షి ప్రశ్నిస్తూ ఓ కథనాన్ని అల్లింది. ఇదే సందర్భంలో గతంలో పరిస్థితి ఇంతకంటే భిన్నంగా లేదంటూ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్‌తో వివరణ ఇప్పించింది.
చంద్రబాబు హయాంలో అధ్వాన పరిస్థితులున్నాయనే కదా, జగన్ సీఎం కావాలని అన్ని వర్గాల ఓటర్లు ఎన్నుకుంది. ఇప్పు డేమో తమనే ప్రశ్నించడం ఏంటని ప్రభుత్వం దబాయింపులకు దిగడం ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. బాబు హయాంలో వేతనాలు, ఇతరత్రా బెన్‌ఫిట్స్ అందడంలో ఆలస్యం జరిగినా….మరీ జగన్ పాలనలో ఉన్నంత దారుణం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎంతసేపూ గతంలో ఎలాంటి అధ్వాన పరిస్థితులున్నాయో చెబుతూ, తమ ప్రభుత్వ అసమర్థతను వెనకేసుకొచ్చేందుకు సాకులు చెప్పడానికే ఏపీ సర్కార్ పరిమితం అవుతోందని తాజా సాక్షి కథనం చెప్పకనే చెప్పింది.
గతంలోనూ 1 -20వ తేదీ మధ్యనేఏ కదా…రెగ్యులర్ ఉద్యోగులకు, పెన్షనర్లకు చెల్లింపులు జరిగాయని, ఆ విషయాన్ని రామోజీ రావు ఎందుకు ప్రస్తావించరని జగన్ పత్రిక నిలదీయడం గమనార్హం. అంటే తమ ప్రభుత్వంలో కూడా 20వ తేదీ వరకూ జీతాలు, పెన్షన్లు చెల్లిస్తున్నామని నేరుగానే అంగీకరించినట్టైంది. ఇదే కదా వాళ్లు కూడా రాసింది. అప్పటి పరిస్థితుల్లో మార్పు కోసమే కదా చంద్రబాబును మార్చింది. అవే పరిస్థితులు కొనసాగేందుకైతే జగన్‌కు ఎందుకు పట్టం కట్టాలి? అప్పటి పాలకులు అలా చేశారని, తాము కూడా అట్లే చేస్తామని చెప్పడంలో అర్థం ఉందా? ఏంటీ రాతలు, వితండ వాదనలు?
తమకు అనుకూల రాతలు రామోజీ నుంచి ఆశించడం ఏంటో వారికే తెలియాలి. రాజకీయంగా ఎవరి వాదనలు ఎలా ఉన్నా… ఉద్యోగులు, పెన్షనర్లు, ఇతరత్రా ప్రభుత్వ యంత్రాంగం అభిప్రాయం ఏంటనేది ముఖ్యం. అదే ఎన్నికల్లో ప్రభావితం చేస్తుందని గ్రహించాలి, గుర్తించాలి.