వారాహి యాత్ర మొదలు పెట్టిన జనసేనాని పవన్‌కల్యాణ్ ఇష్టమొచ్చినట్టు నోరు పారేసుకుంటున్నారు. వైఎస్ జగన్‌పై ఏమైనా మాట్లాడొచ్చనే రీతిలో పవన్ వ్యవహరిస్తున్నారు. తద్వారా తన దత్త తండ్రి కళ్లలో ఆనందం చూడొచ్చని ఉబలాటపడుతున్నాడంటూ వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. అయితే పవన్‌ను వైసీపీకి చెందిన ఇద్దరుముగ్గురు నేతలే టార్గెట్ చేస్తున్నారని జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ అనడం గమనార్హం.
పవన్‌ను వైసీపీకి చెందిన కాపు నేతలే టార్గెట్ చేస్తున్నారనేది జనసేన నేతల భావన. ఇదే విషయాన్ని అనేక సందర్భాల్లో పవన్ కల్యాణే చెప్పారు. అదే మాటను మరోసారి నాదెండ్ల నోట వినాల్సి వస్తోంది. నాదెండ్ల మనోహర్ సోమవారం మీడియాతో మాట్లా డుతూ వారాహి యాత్ర గోదావరి జిల్లాల్లో ఊహించిన దానికంటే ఎక్కువగా సక్సెస్ అయ్యిందన్నారు. సంస్కారం లేని మనుషులు పాలన చేస్తే రాష్ట్రం ఇలాటే వుంటుందని ఆగ్రహించారు.
మీలోనే స్పందన లేనప్పుడు స్పందనా కార్యక్రమాలు ఎందుకని సీఎం వైఎస్ జగన్‌ను నాదెండ్ల ప్రశ్నించడం గమనార్హం. పవన్‌పై వైసీపీలో ఇద్దరు ముగ్గురు నేతలు మాత్రమే ఎందుకు దూషణలకు దిగుతున్నారని ఆయన ప్రశ్నించారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోనే రెండో విడత వారాహి యాత్ర కొనసాగిస్తామని, త్వరలో షెడ్యూల్ ప్రకటిస్తామన్నారు.
పవన్‌పై ముఖ్యంగా మంత్రులు అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, పేర్ని నాని తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుంటారు. పంచ్ డైలాగ్‌లతో పవన్‌ను ఆడుకుంటుంటారు. ఈ ముగ్గురు పవన్ సామాజిక వర్గానికి చెందిన నేతలు కావడం గమనార్హం. ఈ ముగ్గురిని దృష్టిలో పెట్టుకునే నాదెండ్ల మనోహర్ విమర్శించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.