నారా చంద్రబాబు నాయుడుకు కానీ, ఆయన తనయుడికి కానీ అతిగా ప్రాధాన్యతను ఇవ్వడం నందమూరి ఫ్యామిలీకి ఏ మాత్రం కలిసి వస్తున్నట్టుగా లేదు. వెన్నుపోటు ఉదంతంతో మొదలుపెడితే నారా చేతిలో నందమూరి ఫ్యామిలీ పరాభవాలను, అవమానాలనూ పొందడమే కానీ అంతకు మించిన విశేషాలు పెద్దగా ఉండవు. కొంతలో కొంత నందమూరి బాలకృష్ణ నారా ఫ్యామిలీతో వియ్యమంది ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు.
ఎన్టీఆర్ కు వెన్నుపోటు, ఆ పరిస్థితుల్లోనే ఆయన కుంగిపోవడం, కొంతకాలానికి ప్రాణాలను కూడా కోల్పోయారు. చంద్రబాబు తనకు చేసిన ద్రోహం గురించి ఎన్టీఆర్ వాపోయారు. గొడ్డుకన్నా హీనమని, గాడ్సే కన్నా ఘోరమని చంద్రబాబు గురించి ఎన్టీఆర్ స్పందించారు. ప్రతిగా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కు విలువల్లేని కూడా తేల్చారు. చంద్రబాబును ఔరంగ జేబుతో పోల్చారు సీనియర్ ఎన్టీఆర్. చివరకు ఎన్టీఆర్ ను చంద్రబాబు అడ్రస్ లేకుండా చేశారు.
ఇక ఎన్టీఆర్ పెద్ద కుమారుడు హరికృష్ణకు చంద్రబాబు నాయుడు తను ముఖ్యమంత్రి కాగానే మంత్రి పదవిని ఇచ్చినట్టుగానే ఇచ్చి ఆరు నెలలకే సాగనంపారు. తన తండ్రికి రాజకీయ వెన్నుపోటులో తన బావకు సహకరించిన హరికృష్ణ చంద్రబాబు ఇచ్చిన షాక్ కు నివ్వెరపోయారు. దీంతో చేసేది లేక సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. అయితే ఆయన విజయవంతం కాలేదు. ఆ తర్వాత కొన్నేళ్లకు చంద్రబాబుతో రాజీ అయ్యి రాజ్యసభ సభ్యత్వం పొందినా, చంద్రబాబు ఆటలో హరికృష్ణ ఆ పదవిని కూడా కోల్పోయారు.
ఇక 2009 ఎన్నికల్లో మామ చంద్రబాబుపై అపరిమితమైన ప్రేమాభిమానంతో జూనియర్ ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. తన స్థాయికి మించి ఇందిరాగాంధీని కూడా ఆ ఎన్నికల ప్రచారంలో ఈయన విమర్శించారు. తన వయసుకు, తాహతుకు మించిన మాటలు మాట్లాడారు. అలా విపరీత స్థాయిలో ప్రచారం చేస్తూ.. ఒక రాత్రి యాక్సిడెంట్ కు గురయ్యారు తారక్. ఎన్నికల వేడిలో ఆ యాక్సిడెంట్ కు గురై ఎన్టీఆర్ ప్రచార పర్వానికి దూరం అయ్యారు. ఆ ఎన్నికల్లో టీడీపీ చిత్తయ్యింది. ఆ తర్వాత ఎన్టీఆర్ ను చంద్రబాబు పూర్తిగా పక్కన పెట్టారు.
ఇక గత కొన్నాళ్లుగా తారకరత్న చంద్రబాబు, లోకేష్ ల తరఫున తిరుగుతూ ఉన్నారు. పచ్చ చొక్కా వేసుకుని తెలుగుదేశం కార్యక్రమాలు ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లి కనిపించారు. బాలకృష్ణ తరఫున హిందూపురంలో ప్రచారం కూడా చేస్తూ వచ్చారు. సినిమాలు లేని తారకరత్న ఇలా చంద్రబాబు, ఆయన తనయుడి సేవలో రాజకీయంలో కనిపించారు. సరిగ్గా లోకేష్ పాదయాత్ర ఆరంభం రోజున ఆ కార్యక్రమంలో పాల్గొన్న తారకరత్న అక్కడే గుండెపోటుకు గురయ్యి ఆసుపత్రి పాలయ్యారు పాపం.
ఇలా చూస్తే.. నారా కుటుంబ సేవ కోసం లేదా నారా కుటుంబానికి అతిగా ప్రాధాన్యతను ఇచ్చినప్పుడల్లా నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులు ఈ తరహా పరిస్థితులను ఎదుర్కొంటుండటాన్ని గమనించవచ్చు.