గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ విషయాన్ని ప్రధానంగా ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ముందస్తు ఎన్నికలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తన మనసులో మాట చెప్పారు.
ఒకవేళ జగన్ సర్కార్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలంటే వాళ్లిచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. వైసీపీ సర్కార్ తానిచ్చిన హామీలను నెరవేర్చలేదని లోకేశ్ ఆరోపించడం గమనార్హం.
రూ.3 వేలకు పెన్షన్ పెంచుతామన్న హామీని నెరవేర్చలేదన్నారు. అలాగే ఇంట్లో ఎంత మంది బిడ్డలుంటే అందరికీ అమ్మ ఒడి ఇస్తామన్నారని చెప్పారు. అదీ చేయలేదన్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారని, ఇప్పుడు దాని ఊసేలేదని లోకేశ్ విమర్శించారు. సీఎం జగన్ మాత్రం తాను అన్ని హామీలను నెరవేర్చానని చంకలు గుద్దుకుంటున్నారని వెటకరించారు.
తాను చెప్పిన మూడు హామీల మాటేంటని ఆయన ప్రశ్నించారు. స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇస్తామని చెప్పారని, అదీ జరగలేదన్నారు. నెల్లూరులో ఉద్యోగాల గొడవ తన దృష్టికి వచ్చిందన్నారు. స్థానికులకు కాకుండా పక్క రాష్ట్రాల వాళ్లకి ఉద్యోగాలు ఇస్తున్నారనే ఫిర్యాదులు పాదయాత్రలో తనకు వచ్చినట్టు లోకేశ్ తెలిపారు. చేశామని చెప్పుకోవడం సులువని, చేయడం చాలా కష్టమన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లడం వాళ్ల ఇష్టమన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీడీపీ సిద్ధంగా వుంటుంది, ఉంది అని లోకేశ్ స్పష్టం చేశారు.