యువగళం పేరుతో లోకేశ్ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. పాదయాత్రలో లోకేశ్‌కు ఉన్నట్టుండి కోపం, ఆవేశం ఎందు కొస్తున్నాయో ఆయనకే తెలియాలి. అసలే తండ్రీతనయుల పాదవాసి బాగా లేదనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పర్యటిస్తున్న లోకేశ్ ఉన్నట్టుండి… మీసం మెలేసి వైసీపీ నేతలకు హెచ్చరికలు చేయడం గమనార్హం. టీడీపీ వాళ్లకు పెద్ద జబ్బు ఏంటంటే…. తంతాం, పొడుస్తాం, తాట, తోలు తీస్తామని ఘాటైన హెచ్చరికలు చేస్తారు. ప్రత్యర్థులేమో ఏం మాట్లాడకుండా యాక్షన్‌లోకి దిగుతుంటారు. అప్పుడేమో టీడీపీ నేతలు లబోదిబోమంటారు.
హెచ్చరికలు చేయమని ఎవరు చెప్పారు? సమస్య ఎదురైతే దీటుగా ఎదుర్కోడానికి బదులు పారిపోయి, ఆ తర్వాత ప్రగల్భాలు పలకడం దేనికి? గన్నవరంలో ఇదే జరిగింది. పట్టాభికి పబ్లిసిటీ పిచ్చి పీక్కు చేరింది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరేయ్, ఓరేయ్ అని తిట్టాడు. నేనొస్తున్నా….కాచుకో అని గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిన విషయాలే.
లోకేశ్ కూడా తన స్థాయిని పట్టాభి, బుద్ధా వెంకన్న తదితర చిల్లర నేతల స్థాయికి దిగజార్చుకుంటున్నారు. లోకేశ్ పాదయాత్ర చేయడానికి వైసీపీ నేతలు స్కూల్లో రాళ్లు, కత్తులు, కట్టెలతో సిద్ధంగా ఉన్నారంటూ టీడీపీ ఓ సీన్‌ను క్రియేట్ చేసింది. దాన్ని ఆధారంగా చేసుకుని లోకేశ్ చిందులు తొక్కారు. పాదయాత్రలో లోకేశ్ ఏమన్నారంటే…
‘వైసీపీ వాళ్లు దాడి చేయడానికి రాళ్లు, కత్తులు పట్టుకుని ఉంటే కేసులు పెట్టరేం.. కానీ నేను స్టూల్ ఎక్కి మాట్లాడితే కేసులా..? గన్నవరంలో మా పార్టీ ఆఫీసుపై దాడిచేస్తే కేసులుండవా?. నేను చెబుతున్నా చంద్రబాబు నాయుడు ఒక్క చిటికేస్తే వైసీపీ వాళ్ల సంగతి మేం చూసుకుంటాం. ఏం మాకు పౌరుషం లేదని అనుకుంటున్నారా?. మీసాలు తిప్పి చెబుతున్నా.. రా చూస్తా. మా ఓర్పు, సహనాన్ని పరీక్షించకండి. దాడి చేయడానికి యత్నించిన ఒక్కొక్కర్ని కట్ డ్రాయర్ మీద ఊరేగిస్తాను. దమ్ముంటే రండి నేను ఇక్కడే ఉన్నా’ అని నారా లోకేశ్ ఆవేశంతో ఊగిపోయారు.
లోకేశ్ పాదయాత్ర చేయాలని వైసీపీ నేతలు గట్టిగా కోరుకుంటున్నారు. లోకేశ్ పాదయాత్ర వల్ల తమకు పది ఓట్లు పెరగడమే తప్ప, నష్టం వుండదని అధికార పార్టీ నమ్మకంగా వుంది. అలాంటప్పుడు పాదయాత్రకు అడ్డంకులు ఎందుకు సృష్టిస్తుంది? పాదయాత్రకు ఏదో రకంగా ప్రచారం తెచ్చుకోడానికే ఇలాంటి చిల్లర రాజకీయాలకు టీడీపీ పాల్పడుతోందనే ఆరోపణలు లేకపోలేదు. చంద్రబాబునాయుడు చిటికేస్తుంటే వైసీపీ నేతలు వద్దంటారా?
ఒకవేళ లోకేశ్ పాదయాత్రను అడ్డుకోవాలంటే… వైసీపీ నేరుగా రంగంలోకి ఎందుకు దిగుతుంది? ఆ మాత్రం కామన్సెన్స్ కూడా లేకుండా మాట్లాడితే ఎలా? తన పార్టీ శ్రేణుల్ని ఉత్సాహపరచడానికి లోకేశ్ మీసం తిప్పుతూ హెచ్చరికలు జారీ చేస్తున్నారనేది వాస్తవం. మామ నందమూరి బాలయ్య సినిమాల్లో మీసాలు తిప్పడం, తొడలు చరచడం చూశాం. మామలా మీసం తిప్పడానికి, తొడలు తట్టడానికి ఇదేమైనా సినిమానా? అని లోకేశ్‌ను ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు.