సీనియర్ పొలిటీషియన్ కన్నా లక్ష్మీనారాయణ ఇవాళ్టి నుంచి టీడీపీ సీనియర్ నేత కానున్నారు. అయితే టీడీపీలో కన్నా ప్రస్థానం సంతోషంగా సాగుతుందా? అనే చర్చకు తెరలేచింది. గతంలో తనను తిట్టిన కన్నాకు చంద్రబాబు రాజకీయ ప్రాధాన్యం ఇవ్వరనే మాట బలంగా వినిపిస్తోంది. ఇందుకు నిలువెత్తు ఉదాహరణగా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గురించి చెబుతున్నారు.
రాజకీయ జీవితంలో అనేక మలుపులు ఉన్నాయి. గతంలో వైసీపీలో చేరడానికి అన్నీ సిద్ధం చేసుకున్న తరుణంలో కేంద్రహోం శాఖ మంత్రి అమిత్‌షా నుంచి ఫోన్ రావడంతో రాత్రికి రాత్రే నిర్ణయాన్ని మార్చుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఏపీ బీజేపీ అధ్యక్షుడయ్యారు. ఆ తర్వాత తన స్థానంలో సోము వీర్రాజు రాకను ఆయన జీర్ణించుకోలేకపోయారు.
అప్పటి నుంచి ఆయన టీడీపీకి అనుకూలంగా వ్యవహరించడం మొదలు పెట్టారు. అంటే ఎన్నికల సమయానికి టీడీపీలో చేరాలని మనసులో ఓ దృఢ అభిప్రాయాన్ని ఏర్పరచుకుని, సీఎం జగన్‌పై విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. తద్వారా తాను మీ మనిషినే అనే సంకేతాల్ని చంద్రబాబుకు పంపారు. బీజేపీలో వుంటూనే టీడీపీ అనుకూల నాయకుడిగా గుర్తింపు తెచ్చు కున్నారు. అమరావతి రాజధానిపై బీజేపీలో టీడీపీ వాయిస్‌ను బలంగా వినిపించారు. ఇంత కాలం బీజేపీ నేతగా అనధికారికంగా చంద్రబాబు రాజకీయ పల్లకీని కన్నా మోశారు.
రాజకీయంగా క్రియాశీలక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. బీజేపీలో వుంటే ఎప్పటికీ ప్రజాప్రతినిధి కాలేననే భయమే కన్నా కీలక నిర్ణయం తీసుకోడానికి కారణమైంది. తనకు టీడీపీనే సరైందనే నిర్ణయానికి వచ్చారు. గతంలో కాంగ్రెస్ నేతగా చంద్రబాబును బండబూతులు తిట్టిన సంగతి కన్నా మరిచిపోయినట్టున్నారు. కానీ తనను తిట్టిన కన్నాను చంద్రబాబు ఎప్పటికీ మరిచిపోరనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేసిన సందర్భంలో చంద్రబాబును టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తిట్టిన తిట్టు అన్నీఇన్నీకావు. ఆ తర్వాత కాలంలో టీడీపీలో గోరంట్ల చేరారు. కానీ తనను గోరంట్ల అనరాని మాటలన్నీ అన్నారన్న సంగతిని చంద్రబాబు మరిచిపోలేదు. ఆ కారణంగానే సీనియర్ ఎమ్మెల్యే అయిన గోరంట్లను కేబినెట్లోకి తీసుకోలేదు. పక్క పార్టీ నుంచి తీసుకొచ్చిన వాళ్లకు ప్రాధాన్యం ఇచ్చిన చంద్రబాబు… పార్టీని ప్రేమించే గోరంట్లను ఎందుకు విస్మరించారో అందరికీ తెలుసు. రానున్న రోజుల్లో కన్నాకు కూడా గోరంట్ల గతే పడుతుందా? అనే చర్చకు తెరలేచింది.
వంగవీటి మోహన్‌రంగాను చంద్రబాబే చంపించారనే కన్నా ఆరోపణలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తనను కూడా చంపాలని చంద్రబాబు అనుకున్నారని, కానీ అది సాధ్యం కాలేదని ఆయన అనడాన్ని ఎలా చూడాలి? రాజకీయ అవసరాల రీత్యా చంద్రబాబు పంచన కన్నా చేరుతున్నప్పటికీ, ఆయన మనసును గాయపరిచిన వైనాన్ని మరిచిపోతారని అనుకోలేం. అన్నిటికీ మూల్యం చెల్లించుకోడానికి సిద్ధపడి కన్నా పసుపు కండువా కప్పుకోవాల్సి వుంటుంది.