హిండెన్ బర్గ్ నివేదికతో అదానీ కొంప మునిగింది. కంపెనీ షేర్లు ఆల్ టైమ్ కనిష్టాల్లోకి వెళ్లిపోయాయి. అయితే ఆ పతనానికి కూడా ఎక్కడో ఒక చోట బ్రేక్ పడకపోతుందా అని షేర్లు అమ్మకుండా అట్టిపెట్టుకున్నవారు ఆశపడ్డారు. కానీ అదానీపై దెబ్బమీద దెబ్బ పడుతూనే ఉంది. తాజాగా వికీపిడియా చేసిన ఆరోపణలతో అదానీ షేర్లు పతనావస్థకు చేరుకున్నాయి. వికీపిడియా వల్ల ఒక్కరోజే అదానీ సంపద 51,294కోట్ల రూపాయలు ఆవిరైంది.
నెలరోజుల్లో 60శాతం హాం ఫట్..
హిండెన్ బర్గ్ నివేదిక విడుదలైన తర్వాత జనవరి 25నుంచి అదానీ షేర్ల పతనం మొదలైంది. ఇప్పటి వరకూ ఆ కంపెనీ షేర్ల ధర 60శాతం పడిపోయింది. ఆ పతనం ఖరీదు 11 లక్షల కోట్ల రూపాయలు. పరిస్థితులు చక్కబడకపోతాయా, ఎప్పటికైనా అదానీ షేర్ల ధరలు పెరగకపోతాయా అని ఆశపడుతున్న మదుపరులకు వికీపిడియా బయటపెట్టిన విషయాలు మరిన్ని కొత్త భయాలను కలిగించాయి. దీంతో షేర్లను తెగనమ్మడం మొదలుపెట్టారు షేర్ హోల్డర్లు.
తప్పు చేశానని ఒప్పుకున్నట్టేనా..?
పోనీ హిండెన్ బర్గ్ నివేదిక తప్పు అనుకుందాం, దాన్ని కవర్ చేసుకోడానికి వికీపిడియాలో పెయిడ్ ఎడిటర్లతో అనుకూల వ్యాసాలు రాయించడం ఏంటి..? అంటే చేసిన తప్పుని అదానీ కవర్ చేసుకోవాలనుకుంటున్నారా..? అదే నిజమైతే ఎప్పటికైనా అదానీ కంపెనీతో ముప్పే. ఈ లాజిక్ తోనే ఇప్పుడు చాలామంది నష్టాలొస్తాయని తెలిసినా మరింత మునిగిపోకముందే ఒడ్డున పడదామనుకున్నారు. షేర్లను తెగనమ్మారు. దీంతో ఒక్కరోజులోనే అదానీ కంపెనీలు 51,294కోట్ల రూపాయలు నష్టపోయాయి.
కవరింగ్ కష్టాలు..
అప్పులోళ్లు దండెత్తకముందే, ముందుగానే తెలివిగా అదానీ గ్రూప్ రుణాలు చెల్లిస్తూ సింపతీకోసం ట్రై చేస్తోంది. అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ రూ.1,500 కోట్ల రుణాన్ని తిరిగి చెల్లించేసింది. SBI మ్యూచువల్ ఫండ్ కు రూ.1,000 కోట్లు, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్ కు రూ.500 కోట్లు చెల్లించింది. మరో వైపు SEBI కూడా ఈ రుణాల చెల్లింపులపై ఆరా తీస్తోంది. అదానీ కంపెనీలు తీసుకున్న రుణాలు, జారీ చేసిన సెక్యూరిటీస్ రేటింగ్ లను తెలియజేయాలని దేశీయ రేటింగ్ సంస్థలను ఆదేశించింది SEBI. అదే సమయంలో కొత్త ప్రాజెక్ట్ లేవీ చేపట్టడంలేదని అదానీ గ్రూప్ స్పష్టం చేసింది.
ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేస్తున్నా.. అదానీ గ్రూప్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోకపోవడం విశేషం. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అంటూ ప్రధాని మోదీ మీనమేషాలు లెక్కబెడుతున్నారు. ఆప్త మిత్రుడిని కాపాడేందుకు శత విధాల ప్రయత్నిస్తున్నారు. కానీ అదానీ గాలి బుడగ పేలిపోయింది. అపర కుబేరుడు జారుడు మెట్లపై కిందకు పడిపోతున్నాడు. ఈ పతనం ఎక్కడితో ఆగుతుందో వేచి చూడాలి.