వైసీపీ ప్రజాప్రతినిధుల్లారా… వినిపిస్తోందా? నారా లోకేశ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రిటర్న్ గిఫ్ట్ ఇస్తారట. పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అక్రమాలకు పాల్పడిందనేది ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఆరోపణ. వైసీపీని గట్టిగా ఎదుర్కోలేని దుస్థితిని నిన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల తీరు చూపింది. ఈ నేపథ్యంలో రెండు రోజుల విరామం తర్వాత నారా లోకేశ్ మళ్లీ మంగళవారం నుంచి పాదయాత్ర మొదలు పెట్టారు.
42వ రోజు తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఆయన పాదయాత్ర చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అరాచకానికి పాల్పడిందని విమర్శించారు. రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని వైసీపీ నేతలకు లోకేశ్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఎందుకంటే వచ్చేది చంద్రబాబు పాలనే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబు హయాంలో కూడా ఇదే మాదిరి ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. నాడు తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి మంత్రి నారాయణ బామ్మర్ది, నారాయణ ఆసుపత్రి సీఈవోగా పనిచేసిన వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిని నిలిపారు.
నాడు వైసీపీ పోటీ చేయకుండా వ్యూహాత్మకంగా నడుచుకుంది. సీపీఎం అభ్యర్థి శ్రీనివాసులరెడ్డికి మద్దతు ప్రకటించి, ఆయన గెలుపు కోసం వైసీపీ కృషి చేసింది. పట్టాభిని ఎలాగైనా గెలిపించుకోవాలని అధికారంలో ఉన్న టీడీపీ అక్రమాలకు తెరలేపింది. అయితే వామపక్షాలు, వైసీపీ వాటిని ఎదుర్కొన్నాయి. అందుకే ఆ ఎన్నికల్లో సీపీఎం మద్దతుదారుడు గెలుపొందారు. నేడు టీడీపీ సరైన వ్యూహం రచించలేకపోయింది. చివరికి బొక్క బోర్లా పడినట్టే కనిపిస్తోంది.
ఎన్నికల్లో సత్తా చూపకుండా, మళ్లీ తామే అధికారంలోకి వస్తామని, రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని వైసీపీ నేతలకు లోకేశ్ వార్నింగ్ ఇవ్వడం కామెడీగా వుంది. ఎందుకంటే అసలు లోకేశ్ రానున్న ఎన్నికల్లో గెలుస్తారా? లేదా? అనేది అనుమానం. దీంతో ఆయన హెచ్చరికలను వైసీపీ వెటకారం చేస్తోంది.