టీడీపీతో ట‌చ్‌లో వైసీపీ…ఔరా!

ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీల ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. ఒక్కో ఎమ్మెల్సీ అభ్య‌ర్థి గెలుపొంద‌డానికి 23 మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు అవ‌స‌రం. ఈ లెక్క‌న టీడీపీకి ఒక ఎమ్మెల్సీ గెలుపొందే బ‌లం వుంది. అయితే న‌లుగురు…

ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీల ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. ఒక్కో ఎమ్మెల్సీ అభ్య‌ర్థి గెలుపొంద‌డానికి 23 మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు అవ‌స‌రం. ఈ లెక్క‌న టీడీపీకి ఒక ఎమ్మెల్సీ గెలుపొందే బ‌లం వుంది. అయితే న‌లుగురు టీడీపీ ఎమ్మెల్యేలు సొంత పార్టీని కాద‌ని వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తుగా నిలిచారు. ఈ నేప‌థ్యంలో టీడీపీ త‌మ అభ్య‌ర్థిగా పంచుమ‌ర్తి అనురాధ‌ను బ‌రిలో నిలిపారు.

గెల‌వ‌ని సీటుకు వెనుక‌బ‌డిన వ‌ర్గాల నేత‌ల‌ను బ‌రిలో నిల‌బెట్ట‌డం టీడీపీకి వెన్న‌తో పెట్టిన విద్య‌గా ప్ర‌త్య‌ర్థులు విమ‌ర్శిస్తున్నారు. వైసీపీలో అసంతృప్తులెవ‌రైనా త‌మ‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌క‌పోతారా? అనే ఒకే ఒక్క ఆశ టీడీపీలో వుంది. అయితే ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఆ ఒక్క సీటులో కూడా టీడీపీని గెల‌వ‌నివ్వొద్ద‌నే ప‌ట్టుద‌ల‌తో వైసీపీ ఉంది. ఈ నేప‌థ్యంలో టీడీపీ నేత‌ల ప్ర‌గ‌ల్భాలు ఒక రేంజ్‌లో వున్నాయి.

మాజీ హోంమంత్రి, టీడీపీ ఎమ్మెల్యే నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప మీడియాతో మాట్లాడుతూ వైసీపీని క‌వ్వించేలా మాట్లాడారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో పంచుమ‌ర్తి అనురాధ గెలుపు ఖాయ‌మ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. త‌మ‌కు 23 మంది ఎమ్మెల్యేల బ‌లం వుంద‌న్నారు. పార్టీ వీడిన న‌లుగురు ఎమ్మెల్యేల‌కు త‌మ అభ్య‌ర్థికి ఓటు వేయాల్సిన బాధ్య‌త వుంద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. 

ఒక వేళ ఆ నలుగురు త‌మ‌కు ఓటేయకుంటే వైసీపీ నుంచి అంతకంటే ఎక్కువ మందే త‌మ‌కు ఓటు వేస్తార‌ని ఆయ‌న అన్నారు. చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారన్నారు.

అధికార పార్టీ ఎమ్మెల్యేల‌తో ప్ర‌తిప‌క్ష పార్టీ ఎమ్మెల్యేలు ట‌చ్ ఉన్నారంటే…. ఎవ‌రు ఎటు వైపు వెళ్తార‌ని సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు ప్రశ్నిస్తున్నారు. వైసీపీతో టీడీపీ ఎమ్మెల్యేలు ట‌చ్‌లో ఉన్నారంటే… సంథింగ్, సంథింగ్ అనుకోవాల్సి వుంటుంద‌ని సెటైర్స్ విసురుతున్నారు. న‌లుగురికి మ‌రో న‌లుగురు తోడైనా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేద‌ని వైసీపీ నేత‌లు అంటున్నారు. మొత్తానికి అనురాధ బ‌రిలో నిల‌బ‌డ‌డం ఉత్కంఠ రేపుతోంది.