రాజకీయ నాయకులు ఏ రోటి కాడ ఆ పాట పాడడం ఆశ్చర్యకరమైన సంగతి ఎంత మాత్రమూ కాదు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్త పాదయాత్రలో బిజీబిజీగా గడుపుతున్న నారా లోకేష్ ఇదే తరహాలో ఏ ఊరిలో అడుగుపెడితే అక్కడివారికి సంతృప్తి కలిగించే మాటలను వల్లిస్తూ ముందుకు సాగుతున్నారు. దీనిని ఎవరూ కూడా తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే నారా లోకేష్ అనేక సందర్భాలలో తన స్థాయికి మించినది మాత్రమే కాకుండా.. ఒక అసలు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనే ఉండని విషయాలను కూడా ప్రజలకు హామీలుగా గుప్పిస్తుండడం తమాషా.
చినబాబు లోకేష్ ప్రస్తుతం నందికొట్కూరు ప్రాంతంలో పాదయాత్ర సాగిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ బీసీలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. సమావేశంలో వారితోనే గనుక.. బీసీలను ఉద్ధరించడానికి తెలుగుదేశం చాలా కష్టపడిందని చెప్పుకోవడమూ, బీసీలకు తెదేపా తప్ప మరో దిక్కులేదని చెప్పుకోడమూ చాలా సహజం. అయితే చినబాబు లోకేష్ ఒక అడుగు ముందుకు వేసి.. బీసీల కులగణనకు తెదేపా కట్టుబడి ఉన్నదని కూడా సెలవిచ్చారు.
కులగణన అనేది ఏదో పప్పులు బెల్లాలు పంచడం వంటి తాయిలాల సంగతి కాదు. అది పూర్తిగా కేంద్రప్రభుత్వ పరిధిలోని అంశం. ఇందులో రాష్ట్రప్రభుత్వం చేయడానికి ఏమీ ఉండదు. అలాంటిది తన పరిధిలోని పని గురించి హామీ ఇచ్చేస్తూ చినబాబు రెచ్చిపోవడమే తమాషాగా ఉంది.
బీసీల కులగణనకు తీర్మానం చేసి కేంద్రానికి పంపేసి అక్కడికేదో తాము ఉద్ధరించేసినట్టుగా చేతులు దులుపుకోవడం కాదు. కట్టుబడి ఉండడం అంటే బీహార్లో నితీశ్ కుమార్ లాగా వ్యవహరించాలి. నితీశ్ కుమార్ ప్రభుత్వం కూడా ఇదే ప్రయత్నం చేసింది.
అయితే కేంద్రాన్ని ఖాతరు చేయకుండా.. తామే కులగణన చేయాలని సంకల్పించింది. దీని మీద న్యాయపరమైన వివాదాలు రేకెత్తాయి. సుప్రీం కోర్టు కూడా ఇందులో జోక్యం చేసుకోలేమని చెప్పింది. ఒక విడత కులగణన పూర్తిచేశారు కూడా. ఇంత చిత్తశుద్ధితో నితీశ్ కుమార్ సర్కారు కేంద్రంతో సున్నం పెట్టుకుని ఆ పనిచేస్తోంటే.. తాజాగా మళ్లీ న్యాయపరమైన వివాదాలు వచ్చి హైకోర్టు స్టే ఇచ్చింది.
అంటే బీసీల కులగణన చేపట్టడం అనేది అంత క్లిష్టమైన సంగతి అని చినబాబు అర్థం చేసుకోవాలి. ఈ అవగాహన లేకుండా ఏదో పాదయాత్రలో ఉన్న తనను పలకరించడానికి కొందరు బీసీలు ఉమ్మడిగా రాగానే.. నాలుగు మాటలు పథకాలు ప్రకటిస్తే పోయే దానికి బీసీల కులగణన వంటి ఎగస్ట్రా డైలాగులు వేయడం ఎందుకు అని జనం అనుకుంటున్నారు.