సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ జబర్దస్త్‌కు మించిన కామెడీని పండించారు. ఆయన భలే సరదా నాయకుడు. నోటికి ఏది పడితే అది మాట్లాడ్డం, ఆ తర్వాత నాలుక్కరుచుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఆ మధ్య చిరంజీవిని చిల్లరబేరగాడు అని విమర్శించి, ఆ తర్వాత మెగా అభిమానుల వ్యతిరేకతకు తలొగ్గి క్షమాపణలు చెప్పడం తెలిసిందే.
నారాయణ హాస్యం ఒక్కోసారి అపహాస్యమవుతోంది. అయినా ఆయనకు అలాంటివేవీ పట్టింపులు లేవు. ఆయనకు కావాల్సిందల్లా వార్తల్లో వ్యక్తిగా నిలవడమే. సులువుగా పబ్లిసిటీ పొందడం ఎలా? అనే అంశంపై నారాయణతో ప్రత్యేక క్లాస్‌లు ఇప్పించొచ్చు. లాజిక్ లేకుండా మాట్లాడ్డం ఎలాగో నారాయణ నుంచే నేర్చుకోవాలని సరదా కామెంట్స్ వినిపిస్తుంటాయి.
తాజాగా నారాయణ కామెడీ పండించారు. అమరావతి రైతుల గురించి అధికార పార్టీ నేతలు విమర్శిస్తే, నారాయణకు రోషం వచ్చింది. మంత్రులపై విరుచుకుపడ్డారు. రైతుల యాత్రపై సీఎం జగన్ ఆదేశాలతోనే మంత్రులు కారుకూతలు కూస్తున్నారని మండిపడ్డారు.
జగన్ మేనిఫెస్టోలో మూడు రాజధానులని ఎక్కడా అనలేదని ఆయన గుర్తు చేశారు. మూడు రాజధానులకు మద్దతుగా ఒకరిద్దరు రాజీనామా చేయడం కాదని… అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్దామని నారాయణ సవాల్ విసిరారు. అసెంబ్లీ ఎన్నికల్లో పట్టుమని పది స్థానాల్లో కూడా పోటీ చేయని నారాయణ కూడా అసెంబ్లీని రద్దు చేయాలని, ఎన్నికలకు వెళ్తామని సవాల్ విసరడం జబర్దస్త్ కామెడీ కాకుండా మరేంటి? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
ఎవరి కోసం అసెంబ్లీని రద్దు చేయాలి నారాయణ అని నెటిజన్లు నిలదీస్తున్నారు. కమ్యూనిస్టు పార్టీని చంద్రబాబుకు తాకట్టు పెట్టి, రామకృష్ణతో కలిసి చంద్రబాబు అధికార పల్లకీ మోయడానికి అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేస్తున్నారా? అంటూ నారాయణపై నెటిజన్లు సెటైర్స్ విసురుతున్నారు. ఇలా సోషల్ మీడియాలో నారాయణపై భారీ ట్రోలింగ్ జరుగుతోంది.