ఏపీ మంత్రులకు జనసేనాని పవన్‌కల్యాణ్ చేతి నిండా పని పెట్టారు. అకస్మాత్తుగా సోషల్ మీడియా తెరపై పవన్‌కల్యాణ్ ప్రత్యక్షమయ్యారు. దేనికీ గర్జనలంటూ ట్విటర్ వేదికగా వరుస ట్వీట్లతో పవన్‌కల్యాణ్ నిలదీసిన సంగతి తెలిసిందే. పవన్‌కు కౌంటర్ ఇచ్చేందుకు ఏపీ మంత్రులు క్యూ కట్టారు. ఇదంతా చంద్రబాబు కోసమే అంటూ మంత్రులు పవన్‌పై విరుచుకుపడ్డారు. దత్త తండ్రి కోసం దత్త పుత్రుడి ట్వీట్లగా అభివర్ణించారు.
ఏపీ మంత్రుల ఎదురు దాడి పవన్‌కల్యాణ్‌లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. దీంతో ఆయన మరోసారి ట్విటర్ వేదికగా జగన్ ప్రభుత్వంపై తన మార్క్ సెటైర్స్‌తో ప్రత్యక్షమయ్యారు. రాజధాని అంశంపై పవన్‌కల్యాణ్ వ్యంగ్యాస్త్రాన్ని సంధించడం చర్చకు దారి తీసింది. ఏపీని ఏకంగా ఏపీని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్రగా ప్రకటించాలని తీవ్రస్థాయిలో పవన్ వెటకరించారు.
పవన్ కల్యాణ్ వ్యంగ్య ట్వీట్ ఏంటంటే…
“వికేంద్రీకరణే సర్వతోముఖాభివృద్ధికి మంత్రం అనుకుంటే మూడు రాజధానులే ఎందుకు…25 జిల్లాలను రాష్ట్రాలుగా ప్రకటించి 25 రాజధానులను ఏర్పాటు చేయండి. చట్టం, న్యాయ వ్యవస్థ, రాజ్యాంగానికి మీరు అతీతం అన్నట్టు మీరు భావిస్తుంటారు. అలాగే ప్రవర్తిస్తుంటారు కదా! ప్రజాభిప్రాయంతో సంబంధం లేదు కదా మీకు? ఏ మాత్రం సంకోచించకండి. రాష్ట్రంలో వైసీపీ రాజ్యాంగాన్ని అమలు చేయండి” అంటూ ఆయన వ్యంగ్య ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ వైసీపీ నేతలకు చిర్రెత్తుకొచ్చేలా చేసింది. ఏపీ మంత్రులు ఎంత ఎక్కువ ఎదురు దాడి చేస్తే… అంతకు రెట్టింపుగా రియాక్ట్ అవుతానని పవన్‌కల్యాణ్ తన చర్యలతో చెప్పకనే చెప్పారు. పవన్‌కల్యాణ్ తాజా ట్వీట్‌కు వైసీపీ మంత్రుల నుంచి కౌంటర్స్ ఆసక్తి కలిగిస్తాయనడంలో సందేహం లేదు.