నోటి దురుసుతో సిటింగ్ సీటు పోగొట్టుకున్న డిప్యూటీ సీఎం

కేవ‌లం నోటి దురుసుతో సిటింగ్ సీటును డిప్యూటీ సీఎం నారాయ‌ణ‌స్వామి పోగొట్టుకున్నారు. ఏ మాత్రం ఇష్టం లేక‌పోయినా చిత్తూరు ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాల్సిన ప‌రిస్థితి తెచ్చుకున్నారు. నిత్యం వివాదాస్ప‌ద కామెంట్స్‌తో వార్త‌ల్లో…

కేవ‌లం నోటి దురుసుతో సిటింగ్ సీటును డిప్యూటీ సీఎం నారాయ‌ణ‌స్వామి పోగొట్టుకున్నారు. ఏ మాత్రం ఇష్టం లేక‌పోయినా చిత్తూరు ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాల్సిన ప‌రిస్థితి తెచ్చుకున్నారు. నిత్యం వివాదాస్ప‌ద కామెంట్స్‌తో వార్త‌ల్లో నిలుస్తూ వ‌చ్చారు డిప్యూటీ సీఎం నారాయ‌ణ‌స్వామి.

గంగాధ‌ర‌నెల్లూరు (జీడీనెల్లూరు) వైసీపీకి కంచుకోట‌. అధికార పార్టీ నేత‌ల‌కు రాష్ట్రంలో ఎక్క‌డైనా గెలుపుపై అనుమానం ఉండొచ్చేమో కానీ, జీడీనెల్లూరులో మాత్రం ఆ ప‌రిస్థితి లేదు. అలాంటి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న నారాయ‌ణ స్వామికి ఆయ‌న నోరే శ‌త్రువైంది. ముఖ్యంగా త‌మ‌పై నారాయ‌ణ‌స్వామి అన‌వ‌స‌రంగా దూషిస్తున్నార‌నే ఆవేద‌న రెడ్డి సామాజిక వ‌ర్గంలో వుంది.

ఆ నియోజ‌క‌వ‌ర్గంలో వారి ప్రాబ‌ల్యం అధికం. వైసీపీ త‌ర‌పున ఎవ‌రు నిలిచినా క‌ళ్లు మూసుకుని వాళ్లంతా ఓట్లు వేసే ప‌రిస్థితి. అలాంటి చోట కాస్త గౌర‌వంగా అంద‌రితో నారాయ‌ణ స్వామి మెలిగి వుంటే, ఇవాళ చిత్తూరు పార్ల‌మెంట్ స్థానం నుంచి పోటీ చేయాల్సిన ప‌రిస్థితి ఎదుర‌య్యేది కాదు.

నారాయ‌ణ‌స్వామికి ఉన్న చెడ్డ‌పేరు ఏంటంటే… మ‌నిషి చాటు అయితే చాలు తిడ‌తార‌ని. అందుకే కంచుకోట లాంటి నియోజ‌క‌వ‌ర్గంలో కూడా అభ్య‌ర్థిని మార్చాల్సి వ‌చ్చింద‌ని వైసీపీ నేత‌లు అంటున్నారు. చిత్తూరు లోక్‌స‌భ స్థానానికి నారాయ‌ణ‌స్వామిని పంపి, అక్క‌డి నుంచి రెడ్డెప్ప‌ను జీడీనెల్లూరుకు బ‌దిలీ చేశారు. త‌న‌కు సీటు ఇవ్వ‌క‌పోతే అది చేస్తా, ఇది చేస్తా అని బీరాలు ప‌లుకుతూ వ‌చ్చిన నారాయ‌ణ‌స్వామికి వైసీపీ ముకుతాడు వేసింది. ఇంకా ఆయ‌న షాక్ నుంచి కోలుకున్న‌ట్టు లేదు. ఆయ‌న నోరు తెరిస్తే మాత్రం ఏదో ఒక సంచ‌ల‌న కామెంట్ చేయ‌క మాన‌రు. చూద్దాం ఆయ‌న తీరు ఎలా వుంటుందో.