నందమూరి ఫ్యాన్స్ లో ఎన్టీఆర్ అభిమానులు వేరు. మెగాభిమానుల్లో పవన్ ఫ్యాన్స్ వేరు. మెగా కాంపౌండ్ నుంచి అల్లు అర్జున్ ఆర్మీ సెపరేట్. ఇలా చూసుకుంటే కీలకమైన అభిమాన సంఘాలన్నీ ఎప్పుడో చీలిపోయాయి. ఇప్పుడా విభజన రేఖ మరింత స్పష్టంగా కనిపిస్తోంది.
మొన్నటివరకు నందమూరి అభిమానులంతా ఒక్కటే. ఎన్టీఆర్ సినిమా వచ్చినా, బాలకృష్ణ లేదా కల్యాణ్ రామ్ సినిమా వచ్చినా మూకుమ్మడిగా వీళ్ల మద్దతు ఉండేది. అయితే ఈమధ్య ఈ ఫ్యాన్స్ లో కూడా చీలక స్పష్టంగా కనిపిస్తోంది.
నందమూరి అభిమానుల్లో తారక్ వర్గం ఇప్పుడు సెపరేట్ అయింది. వీళ్లు బాలకృష్ణ సినిమాల్ని ఎంకరేజ్ చేయడం లేదు. పైపెచ్చు, బాలయ్య సినిమా రిలీజ్ అయినప్పుడు, ఇతర హీరోల అభిమానులతో కలిసి ట్రోలింగ్ చేయడానికి కూడా వెనకాడ్డం లేదు.
మొన్నటివరకు తెరవెనక ఉన్న ఈ నిజం, తాజాగా బాలయ్య చేసిన ఒకే ఒక్క పనితో ఓపెన్ సీక్రెట్ అయింది. ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఏర్పాటుచేసిన తారక్ ఫ్లెక్సీల్ని తీసేయమని స్వయంగా బాలయ్య చెప్పడం, ఆ వెంటనే ఫ్లెక్సీల్ని అక్కడ్నుంచి పీకేయడంతో.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. ఈ సందర్భంగా నందమూరి అభిమాన సంఘాల్లో వేరు కుంపటి ప్రత్యక్షంగా కనిపించింది.
పెద్ద ఎన్టీఆర్ వీరాభిమానుల్లో పెద్ద వయసువాళ్లు, టీడీపీ సానుభూతిపరులు బాలకృష్ణ వైపు ఉంటే.. యూత్ అంతా తారక్ పక్షం చేరింది. మరీ ముఖ్యంగా బాలకృష్ణకు చెందిన సామాజికవర్గంలో ఈ చీలిక స్పష్టంగా కనిపిస్తోంది.
మెగా కాంపౌండ్ లో వేరుకుంపట్లు ఎప్పుుడో మొదలయ్యాయి. ఎప్పుడైతే పవన్ కల్యాణ్, కాంపౌండ్ కు దూరమయ్యాడో అప్పుడే ఆయన అభిమానులంతా ఇతర మెగా హీరోలకు దూరమయ్యారు. పవనిజం అనే పేరు పెట్టుకొని, తమకుతాముగా ప్రత్యేక అభిమానవర్గాన్ని సృష్టించుకున్నారు. తాము కేవలం పవన్ సినిమాలు మాత్రమే చూస్తామని, ఇతర మెగాహీరోలతో తమకు సంబంధం లేదని బహిరంగంగా చెప్పే ఫ్యాన్స్ కోకొల్లలు.
ఇలాంటి వేరు కుంపటి ఇంకోటి కూడా ఉంది. అదే అల్లు అర్జున్ ఆర్మీ. తన అభిమాన సంఘాలకు బన్నీ స్వయంగా ఈ పేరు పెట్టుకున్నాడు. ఇటు చిరంజీవికి, అటు పవన్ కల్యాణ్ కు సంబంధం లేకుండా తనకుంటూ ఓ అభిమానగణాన్ని సిద్ధం చేసుకొని, దాన్ని పెంచి పోషించే పనిని దిగ్విజయంగా కొనసాగిస్తున్నాడు. ఒకప్పుడు మెగాఫ్యాన్స్ అని సంభోదించే అల్లు అర్జున్, ఇప్పుడు అదే ఫ్యాన్స్ ను ఆర్మీగా పిలుస్తూ, అందులో చాలామందిని తనవైపు తిప్పుకున్నాడు.
ప్రస్తుతానికి అక్కినేని నాగేశ్వరరావు, ఘట్టమనేని కృష్ణ ఫ్యాన్స్ మాత్రమే కాస్త కలివిడిగా ఉన్నట్టు కనిపిస్తున్నారు. వీళ్ల ఫ్యాన్ గ్రూపుల్లో ప్రస్తుతానికి చీలకల్లేవు.