తన ఇంట శుభ కార్యానికి అన్న, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఆహ్వానించి, అవమానకర రీతిలో ప్రవర్తించి విమర్శలను మూట కట్టుకుంటోంది వైఎస్ షర్మిల. ఈ అహంభావం చాలు ఆమె పతనానికి అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. తన కుమారుడు రాజారెడ్డి, ప్రియా అట్లూరి నిశ్చితార్థం, పెళ్లి వేడుకలకు అన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని వైఎస్ షర్మిల ఆహ్వానించారు.
గండిపేట గోల్కొండ రిసార్ట్స్‌లో రాజారెడ్డి, ప్రియా నిశ్చితార్థ వేడుకను గురువారం రాత్రి నిర్వహించారు. చెల్లిపై ప్రేమతో భార్య వైఎస్ భారతితో సహా జగన్ వెళ్లారు. వేడుక మందిరంలోకి వెళుతున్న సందర్భంలో షర్మిలను ఆత్మీయతతో జగన్ అక్కున చేర్చుకున్నారు. అనంతరం నూతన వధూవరులకు పుష్పగుచ్చం ఇచ్చి ఆశీస్సులు అందించారు.
ఈ సందర్భంగా అందరితో కలిసి తియ్యటి జ్ఞాపకంగా గ్రూప్ ఫొటో దిగాలని జగన్ ఆశించారు. తనకు సమీపంలో ఉన్న కుటుంబ సభ్యులను జగన్ పిలిచారు. ఈ క్రమంలో చెల్లి షర్మిలతో పాటు బావ అనిల్‌ను కూడా జగన్ ఆహ్వానించారు. అయితే జగన్ ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నట్టుగా షర్మిల దంపతులు గ్రూప్ ఫొటో దిగడానికి సమ్మతించలేదు.
కూతురి అయిష్టతను గమనించిన వైఎస్ విజయమ్మ దగ్గరికి పిలిచారు. అన్యమనస్కంగానే షర్మిల, అనిల్ కొంచెం దగ్గరగా వచ్చి అన్నతో కలిసి ఫొటో దిగారు. జగన్‌కు అవమానం జరిగినట్టు ఎల్లో మీడియా విస్తృత ప్రచారం చేస్తోంది.
అయితే అన్న కుటుంబాన్ని పిలిచి, అవమానించిన షర్మిల తీరును సభ్య సమాజం ఛీత్కరించుకుంటోంది. ముమ్మాటికీ ఇది షర్మిల కుసంస్కారమని పలువురు విమర్శిస్తున్నారు. తన ఇంట శుభకార్యానికి జగన్ దంపతులు రావడం ఇష్టం లేకపోతే, ఆహ్వానించడం ఎందుకని వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు.
షర్మిల అహంభావంతో వ్యవహరించినా, జగన్ మాత్రం ఆమెను పట్టించుకోకుండా అందరితో కలుపుగోలుగా వ్యవహరించడం అందరి ప్రశంసలు అందుకుంటోంది. షర్మిలే తన అన్న కుటుంబ సభ్యుల్ని దగ్గరుండి ఆహ్వానించి, కుమారుడు, కోడలిని పరిచయం చేసి వుండాల్సింది. అలాగే మధుర జ్ఞాపకంగా మిగిల్చుకునేందుకు అన్న, వదినలతో దగ్గరుండి ఫొటోలు తీయించి వుంటే బాగుండేది. అబ్బే… అలాంటివేవీ ఆమె చేయలేదు. అన్నపై ఎంతగా రగిలిపోతున్నదో నిన్నటి ఆమె తీరు ప్రతిబింబిస్తోంది.