మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. పల్నాడు, తిరుపతి, అనంతపురం ఎస్పీలుగా మల్లికా గార్గ్, హర్షవర్ధన్ రాజు, గౌతమిశాలినీని నియమిస్తూ సీఈసీ ఉత్తర్వులిచ్చింది. ఆ మూడు జిల్లాల్లో ఎన్నికల రోజు, అలాగే ఆ తర్వాత హింస ప్రజ్వరిల్లింది. ఈ దుర్ఘటనలకు కారణమైన ఎస్పీలపై సీఈసీ సీరియస్ అయ్యింది.
తిరుపతి ఎస్పీని బదిలీ చేయగా, పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సీఈసీ సస్పెన్షన్ వేటు వేసింది. ఈ ముగ్గురి స్థానాల్లో కొత్త వారిని నియమించడానికి ప్రభుత్వం నుంచి కొందరు ఐపీఎస్ అధికారుల పేర్లను సీఈసీ కోరింది. ఏపీ ప్రభుత్వం పంపిన జాబితా నుంచి కేంద్ర ఎన్నికల సంఘం ఎంచుకున్న మేరకు నియమించింది.
పల్నాడు జిల్లా ఎస్పీగా నియమితులైన మల్లికా గార్గ్ గతంలో కృష్ణా జిల్లా అడిషనల్ ఎస్పీగా పని చేశారు. అనంతరం ప్రకాశం జిల్లా ఎస్పీగా రెండున్నరేళ్లకు పైగా పని చేశారు. ఆ తర్వాత తిరుపతి ఎస్పీగా తక్కువ కాలం పని చేశారు. పల్నాడు జిల్లాకు వచ్చిన తొలి మహిళా ఎస్పీ కావడం విశేషం.
తిరుపతి ఎస్పీగా నియమితులైన హర్షవర్ధన్ రాజు గతంలో విజయవాడ డిసీపీ. ఆ తర్వాత అన్నమయ్య జిల్లా ఎస్పీగా పని చేశారు. అనంతరం సీఐడీ ఎస్పీగా బదిలీ అయ్యారు. ఇటీవల బీహార్ ఎన్నికల అబ్జర్వర్ గా కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది.