కొత్త బురద తయారు చేసుకున్న పచ్చమీడియా!

ఇప్పుడేం చేయాలి? జగన్మోహన్ రెడ్డి తన కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ పర్వాన్ని నింపాదిగా పూర్తి చేసేశారు. ఒడిదుడుకులు కొన్ని ఎదురైనా అవి చాలా చిన్నవి. చాలా సులువుగా సెట్ అయిపోయేవి. మహా అయితే ఓ…

ఇప్పుడేం చేయాలి? జగన్మోహన్ రెడ్డి తన కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ పర్వాన్ని నింపాదిగా పూర్తి చేసేశారు. ఒడిదుడుకులు కొన్ని ఎదురైనా అవి చాలా చిన్నవి. చాలా సులువుగా సెట్ అయిపోయేవి. మహా అయితే ఓ వారం రోజుల్లో పరిస్థితులు అన్నీ సర్దుకుంటాయి. ఈలోగా కొత్త మంత్రులు తమ తమ శాఖల కార్యాలయాలకు కూడా అలవాటు పడతారు. 

మంత్రివర్గం పేరుతో కుదుపుల తర్వాత.. తిరిగి యథావిధిగా చాలా సాఫీగా ప్రభుత్వ పరిపాలన నడవడం మొదలవుతుంది.. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించడం ఎలాగ? అందుకే పచ్చ మీడియా కొత్త ఎత్తులు వేస్తున్నది.

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మంత్రివర్గం కూర్పులో తనదైన శైలిలో వ్యవహరించారు. బీసీలకు, ఎస్సీలకు పెద్ద పీట వేశారు. ఎంతగా పెద్దపీట వేశారంటే.. బీసీలను జగన్ నెత్తిన పెట్టుకుంటున్నారు.. అనే సంగతి చాలా ప్రస్ఫుటంగా ప్రతి ఒక్కరికీ అర్థమయ్యే రేంజిలో ఈ కూర్పు ఉన్నది. అగ్రకులాల్లో నాలుగు కులాలకు అస్సలు చోటుకల్పించకపోవడం ద్వారా.. ఎంత మంది అసంతృప్తికి గురైనా ఆయన పట్టించుకోలేదు. 

బీసీలకు ప్రాధాన్యం ఇవ్వదలచుకున్న విషయంలో జంకలేదు. ఇప్పుడు బీసీలు ఈ విషయాన్ని గుర్తిస్తే, జగన్ ప్రభుత్వం తమకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని తెలుసుకుని.. తాము కూడా జగన్ పట్ల అంతే స్థాయిలో ఆదరణ పెంచుకుంటే.. తెలుగుదేశం పని గోవిందా అన్నట్లే! అందుకే బీసీలకు ఇన్ని పదవులు ఇచ్చినా కూడా.. ఆ వర్గాల్లో జగన్ పట్ల అనుమానాలు, అసంతృప్తి పెంచడానికి పచ్చ మీడియా కొత్త ఎత్తుగడ వేసింది. 

‘పదవులు ఇచ్చారు గానీ.. స్వతంత్రంగా పనిచేయడానికి అవసరమైన స్వేచ్ఛ ఇవ్వడం లేదు’ అనే ప్రచారాన్ని ప్రారంభించింది. బీసీ, ఎస్సీ మంత్రులు నామ్ కే వాస్తే పదవుల్లో ఉన్నారే తప్ప.. నిర్ణయాలన్నీ వేరెవ్వరో తీసుకుంటున్నారనేది పచ్చ మీడియా ఆరోపణ. ఎస్సీ బీసీలను ముఖచిత్రాల్లాగా మంత్రిపదవుల్లో కూర్చోబెట్టి, తెరవెనుకనుంచి గ్రంథం నడిపించే వారు వేరే ఉంటున్నారని అప్పుడే కథనాలు మొదలైపోయాయి. నిర్ణయాధికారం లేని మంత్రి పదవులు ఇస్తే ఎంత? ఇవ్వకపోతే ఎంత? అని కూడా ప్రచారాలు ప్రారంభించారు. 

బీసీలకు పదవులు ఇవ్వకపోతే ఇవ్వలేదంటారు. ఇస్తే.. పనిచేయనివ్వడం లేదంటారు. జగన్ ప్రభుత్వం ఏం చేసినా సరే.. దానిని వక్రబుద్ధితో మాత్రమే చూస్తారు. జగన్ మీద బురద చల్లడానికి మాత్రమే ప్రయత్నిస్తుంటారు. జగన్ మంత్రి వర్గ కూర్పు బీసీల్లో వైసీపీ ఆదరణ పెంచడానికి ఉపయోగపడేలా ఉండడంతో.. ఇప్పుడు మంత్రులకు స్వేచ్ఛ లేదనే పేరుతో కొత్త బురదను పచ్చ మీడియా వారు తయారు చేసుకుంటున్నారు.