వైసీపీ మంత్రులు తమతమ శాఖల్లో ఇంకా బాధ్యతలు స్వీకరించలేదు. అయితే మంత్రులకు తమ శాఖల పనుల కంటే ముందుగా మరో పని పడింది. అదే విపక్షాలకు కౌంటర్లు ఇవ్వడం.
గత మంత్రివర్గంలో పేర్ని నాని, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్.. విపక్షాలకు వెంటనే చాకిరేవు పెట్టేవారు. వారంతా ఇప్పుడు మంత్రి వర్గంలో లేరు. కాస్త పద్ధతిగా జవాబిచ్చే పెద్దిరెడ్డి, బొత్స, బుగ్గన.. పదవుల్లో కొనసాగుతున్నా బొత్స తప్ప మిగతావాళ్లు ప్రతిపక్షాలపై ఘాటుగా స్పందించింది తక్కువ.
అసలిదంతా ఇప్పుడే ఎందుకు అనుకుంటున్నారా.. పవన్ కల్యాణ్ లైన్లోకి వస్తున్నారు కాబట్టి. పవన్ కల్యాణ్ కౌలు రైతుల భరోసా యాత్రను అనంతపురం జిల్లా కొత్త చెరువు నుంచి ప్రారంభిస్తున్నారు. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి వారికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించబోతున్నారు.
ఈ సందర్భంలో ఆయన జగన్ పై మాటల తూటాలు పేల్చే అవకాశముంది. మరి ఆ తూటాలను మొదటగా ఎదుర్కునేది ఎవరు..? వాటిని బలంగా తిప్పికొట్టేది ఎవరు..? కొత్త మంత్రివర్గంలో పవన్ కి తొలి డోస్ ఇచ్చేది ఎవరు..? ఈరోజు ఇది తేలిపోతుంది.
కొత్తవారిలో ఉత్సాహం..
ఇప్పటివరకూ అంబటి, రోజా, అమర్నాథ్.. ఇలా వీరంతా ఎమ్మెల్యేల హోదాలో పవన్ కల్యాణ్ ని, ఇతర నాయకుల్ని చెడామడా తిట్టినవారే. కానీ తొలిసారిగా మంత్రి పదవి అనే హోదాలో రియాక్ట్ కాబోతున్నారు. మరి కొత్త మంత్రి వర్గం నుంచి పవన్ పై ఎదురుదాడికి ఎవరు రెడీగా ఉంటారు, ఏ మేర కౌంటర్ ఇస్తారనేది ఈరోజే తేలిపోతుంది.
జగన్ ఫస్ట్ టీమ్ తో పోల్చి చూస్తే, సెకండ్ టీమ్ ఏమేరకు స్ట్రాంగ్ గా ఉంటుందో ఈరోజు కొంతమేర అర్థమవుతుంది. అప్పటి వరకూ విపక్షాలపై విరుచుకుపడినవారు కూడా మంత్రి పదవి రాగానే, శాఖాపరమైన పనుల్లో పడిపోయి, ఇతర విషయాలపై ప్రెస్ మీట్లు పెట్టడం కూడా మరచిపోతారు.
ప్రస్తుతం జగన్ టీమ్-బి లో ఉన్నవారు కూడా అలాగే తమ పని తాము చూసుకుంటారా లేక, పవన్ కి చాకిరేవు పెడతారా అనేది తేలాల్సి ఉంది. అంబటి రాంబాబు, రోజా, అమర్నాథ్ లో ఎవరు లీడ్ తీసుకుంటారో చూడాలి.