కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అరెస్ట్‌పై పూటకో మాట, రోజుకో ప్రచారం ఎల్లో గ్యాంగ్ చేస్తోంది. కర్నూలులో తల్లికి చికిత్స అందిస్తున్న అవినాష్‌రెడ్డిని కాసేపట్లో అరెస్ట్ చేయనున్నారని, కేంద్ర బలగాలను రప్పిస్తున్నారని రెండు రోజుల క్రితం ఎల్లో మీడియా ఊదరగొట్టింది. తీరా చూస్తే… అలాంటిదేమీ జరగలేదు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ ఈ నెల 25న అవినాష్‌రెడ్డి బెయిల్‌పై విచారించాలని ఆదేశించడంతో కథ మలుపు తిరిగింది.
ఈ నేపథ్యంలో 25వ తేదీ గడిస్తే ఇక అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేయలేరనే ప్రచారం మొదలైంది. ఇందుకు సీబీఐలో ఎల్లో గ్యాంగ్ అనుకూల అధికారి మార్పే కారణంగా చెబుతున్నారు. మరోవైపు ఇవాళ కొత్త వాదనను ఎల్లో మీడియా తెరపైకి తెచ్చింది. అవినాష్‌రెడ్డి అరెస్ట్ ఉండకపోవచ్చని కొత్త ప్రచారాన్ని స్టార్ట్ చేశారు. ఇందుకు బలమైన కారణం వుందని కూడా వాళ్లే చెప్పారు.
ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వానికే పూర్తి అధికారాలు వుంటాయని ఇటీవల సుప్రీంకోర్టు తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇందుకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. ఈ ఆర్డినెన్స్ రాజ్యసభలో గట్టెక్కాలంటే వైసీపీ మద్దతు బీజేపీకి తప్పనిసరి. రాజ్యసభలో వైసీపీకి 9 మంది సభ్యులున్నారు. దీంతో రాజకీయ అవసరాల కోసం వైసీపీ మద్దతు తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది.
ఈ నేపథ్యంలో సీబీఐ దూకుడుకు కళ్లెం వేసేలా కేంద్ర ప్రభుత్వంపై వైసీపీ ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉందని ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. ఈ కారణంగానే అవినాష్‌రెడ్డి అరెస్ట్ విషయంలో సీబీఐ ముందూ వెనుకా ఆలోచిస్తోందని రాసుకొచ్చారు. ఇలా తమ ఇష్టానుసారం అవినాష్‌రెడ్డి అరెస్ట్‌పై ఒకసారి ఔనని, మరోసారి లేదు లేదని వారు చెబుతున్నారు, రాస్తున్నారు.