ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం పేరు మార్పుపై లక్ష్మి పార్వతి ఎందుకు స్పందించలేదంటూ టీడీపీ నాయకులు తెగ విమర్శలు చేశారు. మండిపడ్డారు. అసలు ఆమెను పెద్దాయన భార్యగానే ఒప్పుకోని చంద్రబాబు, ఇతర టీడీపీ నాయకులు ఆమె స్పందించాలని డిమాండ్ చేయడం విచిత్రంగా ఉంది. సరే …వీళ్ళు విమర్శలు చేశారనో, పెద్దాయన భార్యగా స్పందించకపోతే బాగుండదని అనుకుందో తెలియదుగానీ మొత్తమ్మీద నోరు విప్పి మాట్లాడింది.
పేరు మార్పుపై తన అభిప్రాయం చెప్పింది. అందరూ ఊహించిన విధంగానే జగన్ నిర్ణయాన్ని సమర్థిస్తూనే మాట్లాడింది. దాన్ని ఎవరూ విమర్శించాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ భార్య అయినంత మాత్రాన జగన్ మీద మండిపడక్కరలేదు కదా. పేరు మార్పు మీద క్లుప్తంగా మాట్లాడిన లక్ష్మిపార్వతి ఇతరత్రా విషయాలమీద ఎక్కువగా బాబు మీద నిప్పులు చెరిగారు. గత చరిత్రను తవ్విపోశారు. ఎప్పటిమాదిరిగానే ఎన్టీఆర్ ను చంద్రబాబే చంపాడన్నారు.
ఎన్టీఆర్ పేరు జిల్లాకు పెట్టడమే కరెక్టు అని, యూనివర్సిటీకి అక్కరలేదన్న జగన్ నిర్ణయం సమంజసమేనని అన్నది. ఆమె అందుకు చెప్పిన కారణం ఏమిటంటే … జిల్లా అనేది పెద్దది కాబట్టి దానికి ఎన్టీఆర్ పేరు ఉండాలని, యూనివర్సిటీ అనేది చిన్నది కాబట్టి దానికి ఆయన పేరు లేకపోయినా ఏంకాదని అన్నది. మరో పెద్ద ప్రాజెక్టుకు ఎన్టీఆర్ పెట్టాలని జగన్ కు చెబుతానన్నది. అయితే లక్ష్మీపార్వతి జిల్లా పెద్దది, యూనివర్సిటీ చిన్నది అని ఎందుకు అనుకుంది? జిల్లా అంటే విశాల భూభాగం ఉంటుంది కాబట్టి అది పెద్దదని, యూనివర్సిటీ అంటే ఒక్క భవనమే ఉంటుంది కాబట్టి అది చిన్నదని ఆమె అనుకుంది.
కానీ దేని విలువ దానికే ఉంటాయని ఆమె గ్రహించలేదు. రాష్ట్రంలో జిల్లాలు చాలా ఉంటాయి. కానీ హెల్త్ యూనివర్సిటీ అనేది రాష్ట్రం మొత్తం మీద ఒక్కటే ఉంటుంది. ఏ రాష్ట్రంలోనైనా సాధారణ విశ్వవిద్యాలయాలు చాలా ఉంటాయిగానీ ప్రొఫెషనల్ కోర్సులకు సంబంధించిన యూనివర్సిటీ ఒక్కటే ఉంటుంది. అది కూడా ప్రతిష్టాత్మకమై ఉంటుంది. వ్యవసాయానికి, టెక్నాలజీకి, వైద్యానికి సంబంధించి ఒక్కొక్క యూనివర్సిటీయే ఉంటుంది. మరి అవి చిన్నవి ఎలా అవుతాయి? ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కింద రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు మెడికల్ కాలేజీలు, వైద్యానికి సంబంధించిన ఇతర సంస్థలు ఎన్నో ఉంటాయి.
అలాటప్పుడు అదొక మహా సామ్రాజ్యం అవుతుంది కదా. హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటు చేసింది ఎన్టీఆర్ అయినప్పటికీ దానికి ఆయన తన పేరు పెట్టుకోలేదు. దానికి పెద్దాయన పేరు పెట్టింది చంద్రబాబు. దానికి ప్రత్యేక భవనాన్ని నిర్మించి ఎన్టీఆర్ పేరుకు ముందు డాక్టర్ పదం (డాక్టరేట్ ఉంది కాబట్టి ) చేర్చింది వైఎస్సార్. అంటే ఆయన కూడా ఎన్టీఆర్ ను గౌరవించారు. ఇప్పుడు టీడీపీ-వైసీపీ మధ్య జరుగుతున్న రాజకీయ క్రీడలో భాగంగా జగన్ పేరు మార్చేశారు. కాబట్టి యూనివర్సిటీ చిన్నదని అనుకోవడం లక్ష్మీపార్వతి అవివేకం.