గత రెండు రోజులుగా విశాఖ రుషికొండ బీచ్ ఎంట్రీ ఫీజు వార్తతో రాజకీయ హడావుడి ఎక్కువ అయింది. బీచ్ వస్తే ఫీజులు వేస్తారా, ముక్కు పిండి వసూలు చేస్తారా అంటూ రాజకీయ నేతలు వైసీపీ సర్కార్ మీద గుస్సా అవుతున్నారు.
దీనికి వైసీపీ మంత్రి గుడివాడ అమరనాధ్ పూర్తి స్పష్టత ఇచ్చారు. రుషికొండ బీచ్ ఎంట్రీ ఫీజు వసూలు చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ ఆలోచన అని అసలు విషయం చెప్పారు. రుషికొండ బీచ్ కి బ్లూ ఫ్లాగ్ ఇచ్చినందున ఫీజు పెట్టాలని కేంద్రం ప్రతిపాదనలు చేసిందని తెలియచేశారు.
బీచ్ మెయింటెయినెన్స్ వంటి వాటికి ఆ సొమ్ము వినియోగించాలని కేంద్రం సూచించిందని మంత్రి అంటున్నారు. దీనిని పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం బీచ్ కి వచ్చే సామాన్య ప్రజల మీద ఆ భారాన్ని వేసేందుకు ఇష్టపడలేదని గుడివాడ చెప్పారు.
బీచ్ మెయింటెయినెన్స్ తో పాటు బ్లూ ఫ్లాగ్ స్టాటస్ ని కొనసాగించేలా చేసేందుకు పూర్తి స్థాయిలో ఖర్చుని ప్రభుత్వమే భరిస్తుంది అని ఆయన తెలిపారు. దీని మీద పత్రికల్లో వస్తున్న వార్తలు అవాస్తవం అని ఆయన ఖండించారు. కేంద్రం నుంచి ప్రతిపాదన వచ్చింది అన్నది రాయలేదని ఆయన అంటున్నారు.
సామాన్య ప్రజల మీద భారాలు మోపమని మంత్రి స్పష్టం చేశారు. విశాఖ బీచ్ కి వెళ్తే ఎంట్రీ ఫీజు వేస్తారా అని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శించిన సంగతి తెలిసిందే. అయితే దేశంలో పర్టిక్యులర్ గా కొన్ని బీచులకు బ్లూ ఫ్లాగ్ ఇంటర్నేషనల్ హోదాని ఇచ్చారు. అలా రుషికొండ ఎంపిక అయింది.
విదేశీ పర్యాటకుల తాకిడి కూడా ఇక్కడ ఆస్కారం ఉంటుంది. బహుశా వారిని దృష్టిలో పెట్టుకునో లేక మౌలిక సదుపాయాలు మరో లెవెల్ లో అక్కడ ఉంచాలన్న దాని మీదనో కేంద్రం ఈ రుసుము ప్రతిపాదించింది. కానీ ఏపీ ప్రభుత్వమే భరిస్తామనడంతో ఈ వివాదానికి శుభం కార్డు పడినట్లు అయింది.