భారతీయ జనతా పార్టీకి.. దక్షిణ భారతదేశం ఏమాత్రం కొరుకుడుపడుతున్నట్టుగా లేదు. దేశంలో నరేంద్రమోడీ పరిపాలన గురించి ఎంతగా డప్పు కొట్టుకుంటున్నప్పటికీ.. విమాన టికెట్ చార్జీలతో సమాన ధరలుండే రైళ్లను రాష్ట్రాల్లో ప్రారంభించి.. అక్కడికేదో.. సామాన్యుడి సంక్షేమానికి కట్టుబడి ఉన్నట్టుగా చేసుకుంటున్న ప్రచారార్భాటాలకు అంతగా దక్షిణాదిలో ప్రజాదరణ దక్కకపోవడం వారిని నిరాశపరుస్తోంది.
పార్టీ నాయకులతో సారథి జెపి నడ్డా.. మేధోమధనం సాగిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలు తమ పార్టీని పట్టించుకోకపోవడంపై ఆయన అందరితో కలిసి మల్లగుల్లాలు పడుతున్నారు. కానీ, కాస్తయినా ఆత్మపరిశీలన చేసుకుంటే.. దక్షిణాది రాష్ట్రాలకు ఒకవైపు బోలెడన్ని ద్రోహాలు చేస్తూ.. అక్కడ పార్టీ ఎందుకు బలపడడం లేదు.. అనే సమీక్షలు పెట్టినంత మాత్రాన ఏం ఒరుగుతుంది? ఏ ప్రయోజనం ఉంటుంది.. అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
హైదరాబాదులో భారతీయ జనతా పార్టీ 11 రాష్ట్రాల అధ్యక్షులు, సంస్థాగత ప్రధాన కార్యదర్శుల సమావేశం నడ్డా సారథ్యంలోనే జరిగింది. తాము ఎంతగా ప్రజల్లోకి ప్రచారాలతో చెలరేగిపోవాలని చూస్తున్నప్పటికీ.. దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ శవాసనమే వేసి ఉండడానికి కారణాలేంటని జెపి నడ్డా పార్టీ నాయకులతో సుదీర్ఘంగా చర్చించినట్టుగా వార్తలు వస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాల కోసం ఒక ప్రత్యేకమైన ఎజెండాను రూపొందించాలని కూడా ఈ సమావేశం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఎజెండాలు తయారుచేసినంత మాత్రాన ఏం ఒరుగుతుంది.. ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోతున్నప్పుడు ఏం లాభం ఒనగూరుతుంది అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
భారతీయ జనతా పార్టీ.. రాష్ట్రాలనుంచి రొటీన్ గా వసూలు అయ్యే కేంద్రం వాటా సొమ్ములను ప్రతి పైసా సహా ముక్కు పిండి వసూలు చేసుకుంటూ.. అదే సమయంలో.. కేటాయింపుల విషయం వచ్చేసరికి.. అన్ని రాష్ట్రాలతో పాటూ ఏం వస్తుందో అది ఇవ్వడానికి మాత్రమే ఖర్చు పెడుతూ వస్తోంది. దక్షిణాదిలోని ఏ ఒక్క రాష్ట్రం మీద కూడా మోడీ సర్కారు ప్రత్యేకమైన అభిమానం చూపించిన ఘటన ఈ తొమ్మిదేళ్ల పాలన కాలంలో ఒక్కటి కూడా లేదు. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఇంకా ఘోరం. అమరావతి రాజధానికి ఎంత మొక్కుబడి చెంబుడునీళ్లు, పిడికెడు మట్టితో వచ్చిపోయిన వైనం అందరికీ తెలుసు.
ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా పదేళ్ల పాటు ఇస్తానని తిరుమల వెంకన్న పాదాల సాక్షిగా తిరుపతిలో ప్రకటించిన నరేంద్రమోడీ.. అధికార పీఠం మీదకు రాగానే.. రివర్స్ అయ్యారు. అసలు హోదా అనే మాట మరచిపోమని అంటున్నారు. పోలవరం నిధుల కొరతతో కొన్ని దశాబ్దాల ప్రాజెక్టుగా కునారిల్లుతోన్నదంటే.. కేంద్రం నిధుల విడుదల జాప్యాలు, నిర్లక్ష్యమే కారణమని అందరికీ తెలుసు.
తెలంగాణకు కూడా ప్రత్యేకంగా కేంద్రం చేసింది ఏమీ లేదు. వారు కాళేశ్వరానికి జాతీయ ప్రాజెక్టు హోదా అడిగితే.. దానిని కూడా కేంద్రం పట్టించుకోలేదు. ఒకవైపు దక్షిణాది రాష్ట్రాలకు ఇన్ని రకాల ద్రోహాలు చేస్తూ.. మరోవైపు ఆ ప్రాతంలో తమ పార్టీ బలపడాలని బిజెపి ఎలా ఆశిస్తున్నదో అర్థం కావడం లేదని పలువురు విమర్శిస్తున్నారు.