రైల్వే జోన్ కి పది కోట్లు… అయ్యేనా.?

విశాఖ రైల్వే జోన్ విభజన చట్టంలో ఉంది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్ళు అయింది. అనుకుంటే ఏనాడో రైల్వే జోన్ పూర్తి అయ్యేది. దాన్ని 2019 దాకా నాన బెట్టి ఇచ్చేశామని బీజేపీ…

విశాఖ రైల్వే జోన్ విభజన చట్టంలో ఉంది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్ళు అయింది. అనుకుంటే ఏనాడో రైల్వే జోన్ పూర్తి అయ్యేది. దాన్ని 2019 దాకా నాన బెట్టి ఇచ్చేశామని బీజేపీ పెద్దలు చెప్పారు. తీరా చూస్తే గడచిన నాలుగేళ్లలో రైల్వే జోన్ కి కేంద్రం ఎంత మంజూరు చేసింది అంటే అచ్చంగా 106 కోట్ల రూపాయలు మాత్రమే. ఈ లెక్కలు చెప్పినది ఎవరో కాదు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్.

విశాఖలో దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి గత సంవత్సరం 106.89 కోట్ల బడ్జెట్‌ను మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఇందుకోసం 23-24 ఆర్థిక సంవత్సరంలో 10 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొంది.

ఇదే తీరున కేంద్రం ఏటికో పది కోట్లు మంజూరు చేస్తూ పోతే విశాఖ రైల్వే జోన్ ఎప్పటికి పూర్తి అయ్యేను అని ఎవరికైనా డౌట్ రావచ్చు. కానీ కేంద్ర పెద్దలు మాత్రం విశాఖకు రైల్వే జోన్ ఇచ్చేశామని చెబుతూ ఉంటారు. బడ్జెట్ లో అరకొర నిధులు కనిపిస్తాయి. ప్రతీ ఏటికీ నిర్మాణ వ్యయం పెరిగిపోతూ ఉంటుంది. రైల్వే జోన్ బిల్డింగ్స్ పూర్తి అయ్యేందుకు ఎంత కాలం పడుతుంది అంటే మాధమెటిక్స్ లో దిట్ట అయిన వారు కూడా సమాధానం చెప్పలేరేమో.

రైల్వే జోన్ ఇచ్చేశామని విభజన హామీలలో ఒక హామీకి టిక్కు కొట్టేసి బీజేపీ పెద్దలు మాట్లాడుతూంటారు. ఇంతకీ రైల్వే జోన్ పూర్తి అవుతుందా విశాఖ కల నెరవేరుతుందా అంటే విశాఖ గంభీర సాగరం వైపు సగటు మనిషి అలా చూస్తూ కాలాన్ని దొర్లించడమే మిగులుతోంది.