ఎన్నికల సమయంలో చంద్రబాబు కోసం పని చేసే వాళ్ల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే జనసేనాని పవన్‌కల్యాణ్ సీఎం సీట్లో బాబును కూచోపెట్టాలని తెగ ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను, వైసీపీ నేతల్ని విపరీతంగా దూషిస్తున్నారు. ఇది చాలదన్నట్టు చంద్రబాబు కోసం యాక్టీవ్‌గా పని చేసేందుకు జాతీయ పార్టీకి చెందిన నాయకురాలు తెగ ఉత్సాహం చూపుతున్నారని నెటిజన్లు విమర్శలకు పదును పెట్టారు.
బాబు కళ్లలో ఆనందం చూసేందుకు పరితపిస్తున్న ఆ నాయకురాలికి ముద్దుగా “పవన్‌కల్యాణి” అని నెటిజన్లు పేరు కూడా పెట్టారు. ప్రస్తుతం పవన్‌కల్యాణ్ వారాహి యాత్రకు విరామం ఇవ్వడంతో , జగన్‌ను విమర్శించడానికి “పవన్‌కల్యాణి” బాబు దత్త పుత్రుడి పాత్రను భర్తీ చేస్తున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడాన్ని గుర్తు చేస్తున్నారు.
గతంలో సోము వీర్రాజు వైసీపీ, టీడీపీలను ఏకిపారేయడాన్ని నెటిజన్లు ప్రస్తావించడం విశేషం. అదేంటో గానీ, టీడీపీ పాలనా లోపాల్ని విమర్శించడానికి పురందేశ్వరి అలియాస్ పవన్‌కల్యాణికి మనసు రావడం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలాగైతే బీజేపీ ఎలా బలపడుతుందని ఆ పార్టీ నాయకులు సైతం ప్రశ్నిస్తున్నారు. పురందేశ్వరి విమర్శల తీరు గమనిస్తుంటే, టీడీపీకి బీ టీమ్‌గా పని చేస్తోందనే అభిప్రాయం బలపడుతోంది.
ఇప్పుడు టీడీపీ కోసం సొంత పార్టీ నేతల కంటే… ఒక జాతీయ, మరో ప్రాంతీయ పార్టీ ఏపీ సారథులు గట్టిగా జగన్‌పై విమర్శలు చేస్తున్నారనే చర్చకు తెరలేచింది. తాను బీజేపీ బలోపేతానికి పని చేయాలనే వాస్తవాన్ని విస్మరించి, చంద్రబాబుకు రాజకీయ అనుకుల పరిస్థితులు ఏర్పడేలా పవన్‌కల్యాణి జాగ్రత్తలు తీసుకుంటున్నారని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఏపీలో బీజేపీ వైఖరి ఇట్లే కొనసాగితే… జాతీయ పార్టీ కాస్త టీడీపీ పల్లకీ మోసేదిగా ప్రజలు గుర్తిస్తారనే విమర్శలొస్తున్నాయి. ఏపీ బీజేపీ బలోపేతానికి పురందేశ్వరికి బాధ్యతలు ఇవ్వగా, ఆమె మాత్రం తన తండ్రి స్థాపించిన పార్టీపై ప్రేమ పెంచుకుంటూ, మరిదిని సీఎంగా చూడాలని తపిస్తున్నట్టు కనిపిస్తోందనే అనుమానాలు సొంత పార్టీ నేతల్లో కలుగుతున్నాయి.