టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మంచి కళాకారుడు. బాబుకు పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ వెండితెరపై విశ్వ విఖ్యాత నటుడిగా పేరు గాంచారు. చంద్రబాబు మాత్రం రాజకీయ తెరపై అద్భుత నటుడిగా మన్ననలు అందుకుంటున్నారు. ఎదుటి వాళ్లు నమ్మేలా అబద్ధాలు చెప్పడం కూడా ఒక కళ అంటారు పెద్దలు. ఆ కళ చంద్రబాబుకు బాగా అబ్బింది. రైతుల ఆత్మహత్యలపై చంద్రబాబు సూక్తులు చెప్పడం అంటే… దెయ్యాలు వేదాలు వల్లించడమే.
చంద్రబాబు హయాంలో నిత్యం రైతుల ఆత్మహత్యలుండేవి. విద్యుత్ బిల్లులు కట్టలేక రైతులు ఉసురు తీసుకున్న ఘటనలు కోకొల్లలు. రైతుల కష్టనష్టాలు తెలిసిన నాయకుడిగా వైఎస్ రాజశేఖరరెడ్డి ఉచిత విద్యుత్ పథకాన్ని తీసుకొచ్చారు. దేశంలోనే మొట్టమొదటగా రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా చేసిన ఘనత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వానికే దక్కుతుంది. అప్పట్లో ఉచిత విద్యుత్ అని కాంగ్రెస్ అంటే, తీగలపై బట్టలు ఆరేసుకుంటారని వెటకరించిన ఘనత చంద్రబాబుది. 2004లో చంద్రబాబు గద్దె దిగిపోవడానికి రైతులే ప్రధాన కారణం. రైతులకు తానేమీ చేయలేదని తెలిసి కూడా, ఇప్పుడు ఆయన దబాయింపు చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది.
రైతు బతకాలంటే జగన్ పోవాల్సిందే అని ఆయన నినదిస్తున్నారు. వ్యవసాయానికి చంద్రబాబు పచ్చ వ్యతిరేకి అని బలమైన వ్యతిరేక ముద్ర వుంది. దాని నుంచి బయట పడేందుకు జగన్పై చిందులు తొక్కడం ఆయనకే చెల్లింది. చంద్రబాబు అంటే ఒక్కటంటే ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా గుర్తు రాదు. 14 ఏళ్లపాటు సీఎంగా పని చేసిన చంద్రబాబు తాను రైతుల శాశ్వత సమస్యల పరిష్కారం కోసం కనీసం ఎకరా భూమికి సాగునీటిని ఇచ్చానని చెప్పుకునే పరిస్థితి కూడా లేదు.
ఇప్పుడు మాత్రం జగన్ నాలుగేళ్ల పాలనలో 3 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని విమర్శించారు. రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే మన రాష్ట్రం మూడో స్థానంలో ఉందని వాపోయారు. అన్నదాత పథకం కింద ఒక్కో రైతుకు రూ.20 వేలు ఇస్తామని ఇప్పటికే చెప్పామన్నారు. వైసీపీ ప్రభుత్వానికి ఎక్స్పైరీ డేట్ అయిపోయిందని ఆయన అన్నారు. టీడీపీ అవతరించినప్పటి నుంచి రాష్ట్రాన్ని ఆ పార్టీనే ఎక్కువ కాలం పరిపాలించింది.
ఏపీని ఎక్కువ కాలం పాలించిన ఘనత తనదే అని చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడం చూశాం. మరి ఎందుకని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చలేకపోయారనే ప్రశ్నకు సమాధానం చెబుతారా? రైతులు పంటలు పండించుకోవడానికి సాగునీటి సౌకర్యం కల్పించాలనే యోచన చంద్రబాబుకు ఎందుకు రాలేదు? చంద్రబాబు ఆరోపిస్తున్నట్టు రైతులు 3 వేల మంది ఆత్మహత్య చేసుకున్నారంటే, ఆ కుటుంబాల ఉసురు చంద్రబాబుకు కూడా తగలకుండా వుండదు.
సుదీర్ఘ కాలం పాటు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు… రైతాంగ కష్టనష్టాలకు బాధ్యత వహించాల్సి వుంటుంది. బాబు పాలనలో ఏదైనా మంచి చేసి వుంటే ఇవాళ రైతులు ఎందుకు బలవన్మరణాలకు పాల్పడుతారు? అబద్ధాలు, పరనిందలు, ఆత్మ స్తుతితో చంద్రబాబు కాలం గడుపుతున్నారు. అయితే ప్రజలకు ఎవరేంటనేది బాగా తెలుసు.