జనసేన గెలుస్తామని ఆశ పెట్టుకున్న నియోజకవర్గాల్లో తిరుపతి ఒకటి. 2009లో పీఆర్పీ తరపున మెగాస్టార్ చిరంజీవి గెలుపొంది చట్టసభలో అడుగు పెట్టారు. అప్పట్లో చిరంజీవి సొంత నియోజకవర్గం పాలకొల్లు ప్రజానీకం ఆదరించకపోయినా, రాయలసీమ ప్రేమ చూపింది. తిరుపతిలో పవన్‌కల్యాణ్ సామాజిక వర్గం చెప్పుకో తగ్గ స్థాయిలో బలంగా వుంది. తమ సామాజిక వర్గానికి , ఇతరుల బలం తోడైతే చాలు సులువుగా గెలుస్తామని జనసేన నేతలు అంచనా వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో పవన్‌కల్యాణ్ తిరుపతి బరిలో వుంటారని మొదట్లో అనుకున్నారు. అయితే ఆయన కోస్తా ప్రాంతంలోనే పోటీ చేస్తారని ఇటీవల వారాహి యాత్ర పర్యటనతో నిర్ధారణ అయ్యింది. దీంతో తిరుపతి సీటుపై స్థానిక జనసేన నాయకులు కన్నేశారు. పవన్ పోటీ చేయకపోతే టికెట్ తనకే అని కిరణ్ రాయల్ ప్రచారం చేసుకుంటున్నారు. కానీ కిరణ్‌కు టికెట్ ఇవ్వరని, ఆయనపై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయని ఆ పార్టీలోని అతని వ్యతిరేకులు ప్రచారం చేస్తున్నారు.
జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యుడు, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్‌కు టికెట్ ఖరారు చేసినట్టు సోషల్ మీడియాలో ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. పవన్‌కు మొదటి నుంచి హరిప్రసాద్ వెన్నంటి నడుస్తున్నారు. కిరణ్ రాయల్‌తో పోలిస్తే హరిప్రసాద్ విద్యావంతుడు, సంస్కారవంతుడని ఆ పార్టీ నాయకులు గుర్తించి, టికెట్ ఖరారు చేసినట్టు సమాచారం.
తమ నాయకుడికి టికెట్ ఖరారైందనే సమాచారంతో పసుపులేటి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇకపై తిరుపతి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ, పార్టీని బలోపేతం చేస్తామని చెబుతున్నారు. టీడీపీతో పొత్తు ఉన్నా, లేకున్నా జనసేన తిరుపతి బరిలో ఉండడం ఖాయమని తేల్చి చెప్పడం కొత్త చర్చకు దారి తీస్తోంది. మరి పవన్ సామాజిక వర్గానికే చెందిన టీడీపీ ఇన్‌చార్జ్ సుగుణమ్మ రాజకీయ భవిష్యత్ ఏంటో అర్థం కావడం లేదు. తిరుపతిలో రాజకీయాలు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతున్నాయి.