ఒకప్పుడు రాష్ట్రపతులు, ప్రధాన మంత్రులను ఎంపిక చేయడంలో కీలక పాత్ర పోషించిన చంద్రబాబును ఎవరూ పట్టించుకోకపోతే బాధగా వుండదాండి? తప్పక వుంటుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో చంద్రబాబు వైపు ఇటు పాలకపక్షం, అటు విపక్షాలు చూడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అవకాశవాద రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనమైన చంద్రబాబు నైజాన్ని తెలుసుకోవడం వల్లే జాతీయస్థాయి నేతలెవరూ పట్టించుకోవడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు ఆయనకు ఏపీలో అంత సీన్ లేదని అందరూ మొహం చాటేస్తున్నారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా మొదటిసారిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్మును ఎంపిక చేశారు. విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్‌సిన్హా బరిలో దిగనున్నారు. అయితే ఏ ఒక్కరూ రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక, అలాగే మద్దతుపై చంద్రబాబును సంప్రదించకపోవడం టీడీపీ శ్రేణులకు నిరుత్సాహం కలిగిస్తోంది. జాతీయ స్థాయిలో బాబుకు పలుకుబడి లేదని ఈ ఎన్నిక ద్వారా నిరూపితమైందని అంటున్నారు.
ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు ఏపీ అధికార పార్టీ వైసీపీ అందరూ అనుకున్నట్టే మద్దతు ప్రకటించింది. ఇవాళ నామినేషన్ కార్యక్రమానికి కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెళ్లాల్సి వుంది. అయితే కేబినెట్ సమావేశం నిర్వహించాలని ముందే నిర్ణయించడంతో జగన్ ఢిల్లీ వెళ్లలేదని సీఎంవో ప్రకటించింది.
ద్రౌపది ముర్ము నామినేషన్ కార్యక్రమానికి వైసీపీ తరపున విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి వెళుతున్నారు. కానీ నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన పార్టీని పాలకప్రతిపక్షాలు పట్టించుకోకపోవడం చర్చనీయాంశమైంది. రాజకీయ చరమాంకలో చంద్రబాబు జాతీయ స్థాయిలో ఇంత ఘోరంగా నిరాదరణకు గురి అవుతారని ఎవరూ ఊహించలేదు. ప్రజల్లో పరపతి కోల్పోతే… ఎవరికైనా ఇదే గతి అని చంద్రబాబు ఉదంతమే ఓ హెచ్చరిక.