పదే పదే అదే పాట. అరిగిపోయిన పాట. అదే కేంద్రం ఏపీకి డబ్బులు ఇస్తోంది. అన్ని పధకాలూ మావే. మేమే ఏపీని నడిపిస్తున్నాం. బీజేపీ నేతలు ఇదే పాట ప్రతీ చోట వరస తప్పకుండా పాడుతున్నారు. కానీ రాజకీయ లాభం ఏ మాత్రం కలగడంలేదు.
అయినా సరే పార్టీ జాతీయ నాయకత్వం ఆదేశాల మేరకు, తాము నమ్ముకున్న వ్యూహాల మేరకు ఈ పాటనే పాడుతున్నారు. ఉత్తరాంధ్రా బీజేపీ జోనల్ సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి ఇదే పాట మళ్లీ పాడారు. ఏపీలో సంక్షేమ పధకాలు ఎలా అమలవుతున్నాయి. వాటికి నిధులు కేంద్రం ఇవ్వడం వల్లనే అని ఆమె చెప్పుకున్నారు.
ఏపీని కేంద్రం అన్ని విధాలుగా ఆదుకుంటోందని, ఎన్నో మేళ్ళు చేస్తోందని ప్రకటించారు. ఇక ఉత్తరాంధ్రా జిల్లాలలో గిరిజన విశ్వ విద్యాలయాలు ఇచ్చామని కూడా పేర్కొన్నారు. అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇచ్చిన వర్శిటీలకు నిధులు అరకొరగా అయినా ఇవ్వడంలేదు, మరో వైపు చూస్తే ఉత్తరాంధ్రా వెనకబాటు జిల్లాలకు ప్రత్యేక నిధులు లేవు అయినా అన్నీ చేశామని పదే పదే బీజేపీ నేతలు చెప్పడం మాత్రం ఎక్కడా ఆగడంలేదు అని సెటైర్లు పడుతున్నాయి.
ఇంకో వైపు కేంద్రం డబ్బులు ఇస్తోందని డబాయించి మాట్లాడుతున్న బీజేపీ నేతలు ఆ డబ్బులు కేంద్రానికి ప్రజల పన్నుల నుంచే వెళ్తున్నాయని తెలియాదా అని నిలదీస్తున్నారు. ఇంకో వైపు చూసే ఏపీ నుంచి ఎక్కువగా జీఎస్టీ రూపంలో ఆదాయం వెళ్తోందని అంటున్నారు. మరి ఇలా తీసుకున్న దాని నుంచి తిరిగి ఇవ్వడం కూడా దానమా లేక త్యాగమా లేక మేమే అంతా అన్న భావమా అన్న ప్రశ్నలు అయితే మేధావుల నుంచి వస్తున్నాయి.
సరే అన్ని పధకాలూ మావే, మా డబ్బులే అని చెబుతున్నా బీజేపీకి జనాలు ఎందుకు ఓటేయడం లేదు అన్నది తాపీగా అయినా ఒక ఆలోచన చేయాలి కదా. అలా ఆలోచించి వ్యూహాలు అయినా మార్చాలి కదా. ఏదీ కాకుండా ఎంతకాలం ఈ పాత పాటనే పాడుతారు కమలధారులూ అంటే ఏమో.
ఇదిలాగే ఏనాటికీ సాగే పాటలాగానే ఉందని సెటైర్లు అయితే గట్టిగా పడుతున్నాయి. డబ్బులు మావీ అని చెబుతున్న బీజేపీకి ఈసారి అయినా ఓటేయాడానికి ఏపీ జనాలు రెడీగా ఉన్నారా.. చూడాలి.