మరో రెండు వారాల్లో ప్రేక్షకుల మందుకు రానున్నది సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారువారి పాట. బ్యాంకులు, రుణాలు, వసూలు వంటి వ్యవహారాల నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుందని ఇప్పటికే ప్రచారంలో వుంది. దానికి తగ్గట్టే సినిమా ప్రచార చిత్రాలు, పాటలు అన్నీ సాగుతున్నాయి.
ఇదిలా వుంటే ఈ సినిమాలో కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా వుందని వెల్లడయింది. ఈ సినిమాకు ఆర్ట్ డైరక్టర్ గా పని చేసిన ఎ ఎస్ ప్రకాష్ గ్రేట్ ఆంధ్ర ఇంటర్వూలో ఈ సంగతి వెల్లడించారు.
సినిమాలో కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వుందని, అందులో కూడా బ్యాంక్ వ్యవహారం వుంటుందని తెలిపారు. అందువల్ల ఆ కాలంలో బ్యాంకులు ఎలా వుండేవో అలాంటి సెట్ కూడా వేసామన్నారు. ఆ కాలంలో ఓల్డ్ స్టయిల్ రాతి కట్టడంలో బ్యాంక్ వుంటుందన్నారు.
అలాగే ఈ కాలంలో బ్యాంకులు ఎలా వుంటున్నాయో అలాంటి సెట్ కూడా వేసామన్నారు. ఈ రెండూ కాక మరో బ్యాంక్ సెట్ కూడా వేసామన్నారు. చూస్తుంటే హీరో క్యారెక్టర్ కు బలమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను దర్శకుడు పరుశురామ్ రాసుకున్నట్లు కనిపిస్తోంది.
మహేష్ బాబు-కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే మూడు పాటలు బయటకు వచ్చాయి. కళావతి పాట బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పెన్నీ పాట కూడా ఆకట్టుకునేలా వుంది. థమన్ ఈ సినిమాకు దర్శకుడు.