ఏదో చేయబోతే మరేదో తయారైందని సామెత. పవన్ కళ్యాణ్ తరువాత సినిమా డైరక్టర్ హరీష్ శంకర్ కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఆచార్య ప్రమోషన్ ఇంటర్వూలో భాగంగా చిరు, చరణ్, కొరటాలలను హరీష్ ఇంటర్వూ చేసారు.
ఈ ఇంటర్వ్యూ ముగింపు టైమ్ లో భవదీయుడు భగత్ సింగ్ డైలాగ్ ఒకటి చెప్పమని చిరంజీవి కోరారు. కెమేరాలు ఆపేయమని హరీష్ అనగా లీక్ చేద్దాం అని రామ్ చరణ్ కోరారు. ఆ విధంగా భవదీయుడు భగత్ సింగ్ నుంచి ఓ డైలాగును హరీష్ చెప్పారు.
అదే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది. ఆ డైలాగు అచ్చంగా కెజిఎఫ్ 1 లో డైలాగు మాదిరగా వుండడమే అందుకు కారణం. లక్షమంది తన వెనుక వుండడమే అతగాడి ధైర్యమా అంటే కాదు, అతగాడు ముందు వుండడమే ఆ లక్ష మందికి ధైర్యం అనే అర్థం వచ్చే డైలాగు అది. అచ్చంగా ఇలాంటి డైలాగునే కెజిఎఫ్ 1లో హీరోకు తల్లి చెబుతుంది. ఇక్కడ హరీష్ కూడా పవన్ మీద అలాంటి డైలాగే రాసారు.
దాంతో ఇక యాంటీ ఫ్యాన్స్ కావచ్చు..ఫ్యాన్స్ కావచ్చు, కెజిఎఫ్ 1 లో డైలాగు వీడియోను ప్రచారం చేయడం ప్రారంభించారు. భవదీయుడు భగత్ సింగ్ సినిమా ప్రారంభం కావాల్సి వుంది. ఇంకా ప్రారంభం కాకుండానే కాపీ డైలాగ్ అనే అపప్రధను అనవసరంగా మూట కట్టుకుంటున్నారు హరీష్ శంకర్.