ఎన్టీఆర్ ప్రాణాలతో మాత్రం వద్దు. ఆయన చనిపోయిన తర్వాత పేరు మాత్రం ముద్దు అనే రీతిలో వ్యవహారం నడుస్తోంది. హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించారని తెలియగానే, రాజకీయ పార్టీలకు అతీతంగా చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వాళ్లంతా తెరపైకి వచ్చారు. నందమూరి కుటుంబం తరపున రామకృష్ణ తమ నిరసనను ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు.
ఎన్టీఆర్ పేరు తొలగింపుపై చంద్రబాబు, లోకేశ్, బాలయ్య, పురందేశ్వరి, ఎల్లో మీడియా వీరావేశాన్ని, ఆందోళనను చూస్తే… వీరేనా ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచిందనే అనుమానం రాకుండా వుండదు. వీరిలో లోకేశ్ పిల్లవాడు. ఆయనకు సంబంధం లేదు. ఎన్టీఆర్ను పదవీచ్యుతుడిని చేయడంలో రామోజీరావు, మరో చిన్న మీడియాధిపతి పాత్రల గురించి గత కొన్నేళ్లుగా జనం కథలుకథలుగా చెప్పుకుంటున్నారు.
1995లో చంద్రబాబుకు వెన్నుపోటు పొడిచే కుట్రలో భాగస్వామి అయినందుకే ఓ సామాన్య జర్నలిస్టు, ఆ తర్వాత కాలంలో ఏకంగా మీడియా సంస్థకు అధిపతి అయ్యారనే ప్రచారం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని కత్తులతో ఇష్టానుసారం పొడిచి, సీఎం గద్దె నుంచి అమానవీయంగా దించేసిన వీళ్లేనా… ఇవాళ రోడ్డెక్కి లబోదిబోమంటున్నది అనే అనుమానం కలగకుండా వుండదు.
లక్ష్మీపార్వతిని అడ్డు పెట్టుకుని ఎన్టీఆర్ను సీఎం పీఠం మీద నుంచే కాదు, ఏకంగా ఈ లోకం నుంచి కూడా శాశ్వతంగా పంపేసిన ఈ దుర్మార్గులేనా …ఇప్పుడాయనకు అన్యాయం జరిగిందని వాపోతున్నదనే అనుమానం రాకుండా ఉంటుందా? జీవితమంటే నాటక సమాజమనే పెద్దల మాటకు చంద్రబాబు అండ్ కో నటనే నిలువెత్తు నిదర్శనం. వైశ్రాయ్ హోటల్ ఎదుట ఎన్టీఆర్పై చెప్పులు, రాళ్లు విసిరిన ఈ నాయకులేనా … ఇప్పుడు గవర్నర్ దగ్గరికి వెళ్లి జగన్ ప్రభుత్వంపై ఫిర్యాదు చేస్తున్నదనే సంశయం కలుగుతోంది.
ఎన్టీఆర్ మరణం కోసం ఎదురు చూసిన వీళ్లేనా ఆయనపై అపూర్వ ప్రేమను కనబరుస్తున్నదే ప్రశ్న ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఎన్టీఆర్ ప్రాణం వదిలారనే వార్త తెలిసి… హమ్మయ్య అని ప్రాణం లేచి వచ్చినంతగా ఊపిరి పీల్చుకున్న చంద్రబాబేనా, ఆ మహానుభావుడి ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నది? వారెవ్వా… నటనలో మామను మించి పోయిన అల్లుడిగా చంద్రబాబు చరిత్రకెక్కారు.
చంద్రబాబు ద్రోహంపై ఎన్టీఆర్ స్పందిస్తూ… ఇలాంటి బిడ్డ కలగకూడదు, ఇలాంటి వాడు తమ కుటుంబంలో పుట్టకూడదని అనుకుంటారని ఈసడించుకున్నారు. పిల్లనిచ్చిన మామ చంద్రబాబు గురించి అన్నమాటలివి. రక్తం పంచుకుపుట్టిన కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తే, తండ్రిలాంటి వాడిని మోసం చేస్తాడా? ఒక్కసారి మనసుతో ఆలోచించాలని నాడు ఎన్టీఆర్ సమాజానికి విన్నవించిన సంగతులు నేడు చర్చనీయాంశమయ్యాయి.
“నమ్మినవాళ్లకు ద్రోహం చేస్తాం. నమ్మిన వాళ్ల గొంతుకోస్తామని ఈనాడు నిరూపించుకున్న ఘాతకుడు వాడు. చరిత్ర మరవదు. మొఘల్ సామ్రాజ్యం సమయంలో తండ్రిని జైల్లో పెట్టి అన్నను చంపించాడో రాజు. అదే విధంగా ఈనాడు చంద్రబాబునాయుడు తండ్రిలాంటి ఎన్టీఆర్కు ద్రోహం చేశాడు. కేవలం పదవి కోసం, ఏ విధంగా ఆత్మను అమ్ముకున్నాడో , మానవత్వాన్ని చంపుకున్నాడో శాశ్వతంగా వుంటుంది” అని చంద్రబాబు గురించి నాడు ఎన్టీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ చంద్రబాబునాయుడే నేడు ఎన్టీఆర్కు తీవ్ర అన్యాయం జరిగిందని, పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నారు. అంతా రాజకీయ మహిమ.