ఆదర్శ రాజకీయం పేరిట ఇదొక నయామోసం!

ఎన్నికల్లో ఒక పార్టీ తరఫున గెలిచిన తర్వాత మరొక పార్టీలోకి నాయకులు జంప్ చేయడం అనేది ఇవాళ్టి రోజుల్లో చాలా కామన్ ప్రాక్టీస్ గా మారిపోయింది. నాయకులు అధికార పార్టీ పంచన చేరడానికి ఉత్సాహపడుతుంటారు.…

ఎన్నికల్లో ఒక పార్టీ తరఫున గెలిచిన తర్వాత మరొక పార్టీలోకి నాయకులు జంప్ చేయడం అనేది ఇవాళ్టి రోజుల్లో చాలా కామన్ ప్రాక్టీస్ గా మారిపోయింది. నాయకులు అధికార పార్టీ పంచన చేరడానికి ఉత్సాహపడుతుంటారు. రాజకీయంగా భవిష్యత్తు అనేది ఉంటుందో ఉండదో.. గెలిచిన ఈ సందర్భంలోనే అయినకాడికి దండుకోవాలనే బుద్ధి వలన ఇలా పార్టీలు మారుతుంటారు.

ఎన్నికల తర్వాత ప్రజాప్రతినిధులు ఇలా పార్టీ మారి ప్రభుత్వాలను అస్థిరపరచే సందర్భాలు కూడా అనేకం చూస్తూ ఉంటాం. ఇలాంటి దుర్మార్గాలను అడ్డుకోవడానికే మనదేశంలో ఫిరాయింపుల నిరోధక చట్టం కూడా ఉంది. అయితే శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్టుగా.. ఫిరాయింపుల నిరోధక చట్టానికి దొరక్కుండా పార్టీలు మారడం.. విచ్చలవిడిగా మారింది.

ఈ నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కొత్త బిల్లు తీసుకువచ్చింది. సభ ఆమోదం లభించింది కూడా. ఈ బిల్లు చూడడానికి చాలా ఆదర్శవంతంగా కనిపిస్తుంది. ఒక పార్టీ తరఫున గెలిచిన నాయకులు తర్వాత పార్టీ మారితే గనుక.. వారికి ఇక జీవితంలో పెన్షను రాకుండా ఉండేలాగా బిల్లు తీసుకువచ్చారు.

చాలా ఆదర్శవంతంగా కనిపిస్తున్న ఈ బిల్లులో చిన్న మాయ ఉంది. ఆదర్శ రాజకీయాల ముసుగులో అక్కడి తమ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుకోవడం ఒక్కటే లక్ష్యంగా వారు ఈ చట్టం చేసినట్టుగా కనిపిస్తోంది. ఇంతకూ చట్టంలో ఉన్న మాయ ఏంటంటే.. ఒక పార్టీ తరఫున గెలిచిన తర్వాత పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడిన సందర్భంలో మాత్రమే వర్తిస్తుందిట. అంటే పార్టీ మారే ఎమ్మెల్యేకు పింఛను కూడా దక్కకుండా ఇబ్బంది పెట్టాలా లేదా అనేది పూర్తిగా స్పీకరు చేతుల్లో మాత్రమే ఉంటుందన్నమాట.

ఇది కేవలం హిమాచల్ ప్రదేశ్ లో బిజెపి ఎరవేస్తున్న ఫిరాయింపుల ధాటికి ప్రమాదాల్లోకి నెట్టబడుతున్న కాంగ్రెస్ సర్కారును కాపాడుకోవడం కోసమే ఈ చట్టం అయినట్టు కనిపిస్తోంది.

ఎందుకంటే.. ఈ చట్టం ప్రకారం.. ప్రతిపక్షం నుంచి ఎమ్మెల్యే ఒకరు అధికార పార్టీలోకి ఫిరాయిస్తే.. ఆ ప్రతిపక్షం వారు ఫిర్యాదుచేసినా కూడా స్పీకరు నిర్ణయం తీసుకోకుండా నాన్చుతారు. సాధారణంగా స్పీకరును ప్రశ్నించే అధికారం ఉండదు. అంటే ఎవరైనా అధికారపార్టీలోకి వచ్చి చేరితే వారి మీద అనర్హత వేటు పడే అవకాశమూ ఉండదు. పెన్షన్ కు వచ్చిన నష్టమూ లేదు. కానీ.. అధికార పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి మారితే.. స్పీకరు అధికార పార్టీ మనిషే ఉంటారు గనుక.. ఫిర్యాదు రాగానే తక్షణం వారి మీద వేటు వేసేస్తారు. వేటు పడితే పడింది.. ఉపఎన్నికలో మళ్లీ నెగ్గుదాం అనుకుని వెళ్లేవాళ్లుంటారు.

హిమాచల్ లో గతంలో నలుగురు అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విపక్ష బిజెపిలో చేరారు. ఇలా తెగించేవాళ్లకి పెన్షను రాదు అని బూచిలా భయపెట్టడానికే బిల్లు తెచ్చినట్టుగా ఉంది. హిమాచల్ లోని కాంగ్రెస్ సర్కారు.. ఆదర్శ రాజకీయాల ముసుగులో ఆత్మరక్షణ రాజకీయాలు చేస్తున్నదని ప్రజలు అనుకుంటున్నారు.

2 Replies to “ఆదర్శ రాజకీయం పేరిట ఇదొక నయామోసం!”

Comments are closed.