The GOAT Review: మూవీ రివ్యూ: ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం

కొత్తదనం లేని కథ, ఎక్కడా హత్తుకోని బలహీనమైన కథనం, ఏ ఎమోషన్ తో ట్రావెల్ చేస్తూ అనుభూతి పొందాలో తెలియని ప్రేక్షకుల నిస్సహాయత, క్లైమాక్స్ పెట్టిన సహన పరీక్ష

చిత్రం: ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం
రేటింగ్: 2/5
తారాగణం: విజయ్, ప్రశాంత్, ప్రభుదేవా, అజ్మల్ అమీర్, మోహన్, జయరాం, స్నేహ, లైలా, మీనాక్షి చౌదరి, యోగి బాబు తదితరులు
కెమెరా: సిద్ధార్థ నుని
ఎడిటర్: వెంకట్ రాజెన్
సంగీతం: యువన్ శంకర్ రాజా
నిర్మాత: కల్పతి అఘోరం, గణేష్, సురేష్
దర్శకత్వం: వెంకట్ ప్రభు
విడుదల: 5 సెప్టెంబర్ 2024

విజయ్ హీరోగా సినిమా అంటే తమిళనాటే కాదు తెలుగులో ఈమధ్యన కూడా తనకంటూ ఫాలోవర్స్ ఉన్నారు. రిచ్ యాక్షన్, ఎమోషన్ కలగలిపిన కథలతో ఇతని సినిమాలుంటాయని ఒక అంచనా. ఇంతకీ ఈ చిత్రం గ్రేట్ గా ఉందో, గ్రేటెస్ట్ గా ఉందో.. ఉంటే ఎందులో గ్రేటెస్టో చూద్దాం.

కథలోకి వెళితే గాంధి (విజయ్) స్పెషల్ యాంటి టెరరిస్ట్ స్క్వాడ్ లో పనిచేస్తుంటాడు. ఆ సంగతి అతని భార్య (స్నేహ) కి తెలియదు. వీళ్లకి ఒక ఐదారేళ్ల కొడుకు జీవన్.

గాంధికి ముగ్గురు కొలీగ్స్ (ప్రశాంత్, ప్రభుదేవా, అజ్మల్ అమీర్). వీళ్ల సీనియర్ ఆఫీసర్ నసీర్ (జయరాం).

కెన్యాలో ఒక యాంటి టెరరిస్ట్ ఆపరేషన్లో రాజీవ్ మీనన్ (మోహన్) అనే వ్యక్తిపై దాడి చేస్తారు గాంధి బృందం. ఆ తర్వాత మరొక ఆపరేషన్లో భాగంగా గాంధి తన కొడుకు జీవన్ ని కోల్పోతాడు. అప్పటినుంచి భార్యతో కూడా గాంధికి సంబంధం చెడుతుంది.

కానీ 16 ఏళ్ల తర్వాత రష్యాలో జరిగిన మరొక ఆపరేషన్లో అచ్చం తనలాగే కనపడే ఒక యువకుడిని చూస్తాడు గాంధి. అక్కడి నుంచి కథ ఏ మలుపులు తీసుకుంటుంది? ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? ఇన్నాళ్ళూ ఎక్కడున్నాడు? అతని ఉద్దేశాలు ఏవిటి? అతని వెనుక ఉన్నదెవరు? వీటికి సమాధానాలే తక్కిన కథంతా.

ఐడియాగా ఈ పాయింట్ బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ కథగా మలిచేటప్పుడు తెలివి వాడలేదు. ఎప్పుడు ఏది రివీల్ చేయాలి, ఏది దాచాలి, ఏది దాచకూడదు అనేది చాలా పట్టుతో రాసుకుని ఉండాల్సింది. ఐడియా బాగున్నా కథగా మలచడంలో, కథనం రాసుకోవడంలో ఘోరంగా తప్పటడగులు వేసారు. సంభాషణలు కూడా అస్సలు గ్రిపింగ్ గా లేవు.

ఇది విజయ్ ఫ్యాన్స్ ని మెప్పించే ప్రయత్నంతో అతని ఎలివేషన్స్ తో తీసిన సినిమాలా ఉంది తప్ప ఎక్కడా రచనలో శ్రద్ధ కనపడలేదు. ఓపెనింగ్ ఫైట్ సీన్లో ముసుగు తీయగానే విజయ్ రివీల్ అవుతాడు అనుకుంటే చనిపోయిన కెప్టెన్ విజయ్ కాంత్ కనిపిస్తాడు. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ లో విజయ్ కాంత్ ని రప్పించాడు దర్శకుడు. ఆ తర్వాత కొంత సేపటికి విజయ్ డబల్ యాక్షన్. అందులో కూడా యంగ్ విజయ్ పాత్రకి ఏ.ఐ వాడారు. ఈ టెక్నికాలిటీ పక్కన పెడితే తక్కిన కథంతా ఇద్దరు విజయ్ ల మధ్య ఫైటే. అందులో అన్నీ బలవంతపు సంఘటనలు, ఎక్కడా లాజిక్ లేని సీన్లు. లాజిక్ లేకపోయినా పర్వాలేదు, ఎమోషనల్ మేజిక్ అయినా ఉండాలికదా! అదీ లేదు!

నటీనటవర్గం మాత్రం నిండుగా సీనియర్ హీరో హీరోయిన్లతో నింపేసాడు దర్శకుడు.

విజయ్ ది డబల్ యాక్షన్ ధమాకా. ఫ్యాన్స్ కి ఏమో కానీ సగటు సాధారణ ప్రేక్షకుడికి మాత్రం ఓకే అనిపిస్తాడు. డ్యాన్సులు, ఫైట్స్ బానే చేసాడు.

స్నేహ చాలా సేపు ప్రెగ్నెంట్ గా కనిపించి తర్వాత ఒక మిడిల్ ఏజ్ గృహిణిగా కొనసాగింది.

చాలాకాలం తర్వాత అలనాటి హీరోయిన్ లైలా ప్రశాంత్ భార్యగా కనిపించింది.

ప్రశాంత్, ప్రభుదేవాతో పాటు ఆర్జీవీ సినిమాల్లో జగన్ పాత్రధారి అజ్మల్ అమీర్ కూడా ఈ సీనియర్ నటుల సరసన తన ఉనికి చాటుకున్నాడు.

1980ల నాటి హీరో మోహన్ నెగటివ్ రోల్ లో కాసేపు కనిపించాడు. జయరాం కూడా ఓకే అనిపించాడు. చివర్లో ఒక చిన్న సీనులో శివకార్తికేయన్ కూడా కనిపిస్తాడు.

ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ని, గ్రాఫిక్స్ ని వాడుకుని టెక్నికల్ గా రిచ్ గా తీసిన సినిమా ఇది. నిర్మాణ విలువల్లో ఎక్కడా రాజీ పడలేదు. చెప్పుకోవడానికి ఎంతున్నా కథా కథనాల్లో ఆత్మ లేకపోయే సరికి అసహనం పెరుగుతుంది.

దీనికి తోడు యువన్ శంకర్ రాజా సంగీతం ఈ సినిమాకి ప్రధానమైన మైనస్. నేపథ్య సంగీతం పరమ చిరాకుగా ఉంది. కథనంలో తేడాలున్నా సినిమాని నిలబెట్టేంత శక్తి నేపథ్య సంగీతానికి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం కథనంతో పోటీ పడి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సహనపరీక్ష పెట్టింది. పోనీ ఆటవిడుపుగా పాటలన్నా బాగున్నాయా అంటే అదీ లేదు. పాత పాట “స్వర్గమే ఎండ్రాలుం..” అనే ఇళయరాజా తమిళ హిట్ తెలుగులో వినిపిస్తుంది. అదొక్కటీ కాస్త రిలీఫ్ గా అనిపిస్తుంది. “స్పార్క్..” పాట ఒక్కటీ చూడడానికి బాగుంది. వినడానికి మాత్రం కొత్తగా లేదు.

కథ కెన్యాలో మొదలయ్యి, ఇండియా మీదుగా థాయిలాండ్ వెళ్లి, రష్యాలో టర్నింగ్ తీసుకుని ఇండియాలో చావగొట్టుకోవడంతో ముగుస్తుంది. అన్నట్టు ఇక్కడ చెప్పుకున్న అన్ని దేశాల్లోనూ చావగొట్టుకోవడాలు కామన్. సగం సినిమా స్టంట్ మాస్టర్ కి అప్పజెప్పి దర్శకుడు చిల్ అయ్యాడేమో అని అనిపిస్తుంది.

పోస్టర్ మీద ఇద్దరు విజయ్ లని చూపించేయడం వల్ల సినిమా చూస్తున్నప్పుడు టర్నింగ్ పాయింట్ ముందే తెలిసిపోయేట్టు ఉంది. కనీసం పోస్టర్లో ఎంత వరకు రివీల్ చేయాలో తెలియనితనంతో రిలీజ్ చేసారు దీనిని. ఒక కీలకమైన సీన్ తర్వాత, 2008 నుంచి కథ 2024కి షిఫ్ట్ అవుతుంది. సరిగ్గా అప్పుడే పోస్టర్ గుర్తుకొచ్చి ఒక అనుమానమొస్తుంది. ఆ అనుమానం కాసేపటికి నిజమవుతుంది. దానివల్ల తెరమీద కనిపించిన ట్విస్ట్ ట్విస్టులా అనిపించదు.

పోయాడనుకున్న ఒక వ్యక్తి చాలా ఏళ్ల తర్వాత కనిపిస్తే, అన్నాళ్లూ ఎక్కడున్నావని, ఎవరి దగ్గరున్నావని అడగడం సహజం. ఆ ప్రశ్నలు ఎవ్వరూ అడగరిక్కడ. ఏదో ఊరెళ్లి వచ్చిన వ్యక్తితో గడుపుతున్నట్టు కాజువల్ గా గడిపేస్తుంటారు. ఇలాంటి అసహజమైన పాత్రల బిహేవియర్ వల్ల ప్రేక్షకుడు కనెక్ట్ కాలేని పరిస్థితి. అలాగే ఒకచోట చిన్నపిల్లలని హింసించే సన్నివేశాలు ఘోరంగా ఉన్నాయి.

ఒక్క వాక్యంలో చెప్పాలంటే ఇది ఒక విలన్ రివెంజ్ డ్రామా. కానీ అది ప్రేక్షకుల మీద తీర్చుకున్నట్టు అయింది. ఇందులో హీరో, విలన్ రెండూ విజయే. ఎవరితో కనెక్ట్ అయ్యి చూడాలో అర్ధం కాదు.

ఈ సినిమాలోని క్లైమాక్స్ “వరెస్ట్ ఆఫ్ ఆల్” అనే రేంజులో ఉంది. క్రికెట్ స్టేడియంలో ఆ యాక్షన్ ట్రాక్ ఏవిటో, చేజింగులేవిటో, ఫ్లడ్లైట్లంత ఎత్తు మీద చావచితక్కొట్టుకోవడమేంటో అర్ధం కాదు. ధోనీ లాంటి వాళ్లని చూపిస్తూ అంత టైట్ సెక్యూరిటీ ఉన్నచోట ఈ పిచ్చి చేజులు చిన్నపిల్లలాటల్లా ఉన్నాయి. అసలీ క్లైమాక్స్ విన్నాక అయినా విజయ్ ఒక్కసారి ఆలోచించుకోవాల్సింది.

కొత్తదనం లేని కథ, ఎక్కడా హత్తుకోని బలహీనమైన కథనం, ఏ ఎమోషన్ తో ట్రావెల్ చేస్తూ అనుభూతి పొందాలో తెలియని ప్రేక్షకుల నిస్సహాయత, క్లైమాక్స్ పెట్టిన సహన పరీక్ష… వెరసి ఇది “గ్రెటేస్ట్ ఆఫ్ ఆల్ టైం స్టుపిడిటి” అనిపిస్తుంది.

బాటం లైన్: చావగొట్టి చెవులు మూసాడు

30 Replies to “The GOAT Review: మూవీ రివ్యూ: ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం”

  1. ఈ గొర్రె బిడ్డ విజయ్ గా — డు సింగిల్ వేషం వేస్తేనే చూడలేము ఇక డబుల్ వేషం అంటే చూసేవాళ్ళకి నరకమే ఆరవ కు — క్క — ల అతికి వీ — డు నచ్చుతాడు వేరే భాషల వాళ్ళు ఛీ అంటారు

  2. Asalu ఈ గొర్రె ఆరవ బిడ్డ విజయ్ గా — డు అసలు యే ఫీలింగ్ ఏ ఎమోషన్ ఇస్తాడో తెలుసుకోవడం మానసిక శాస్త్రవేత్తలకు కూడా అర్థం కాదు మళ్ళీ వీ — డు ఆరవ కు — క్క లకి సూపర్ స్టార్ కామెడీ

  3. జగన్ పాత్రధారి అని రాసారు కాని రంగం ఫేమ్ అంటే వెంటనే తెలుస్తుందేమో!

  4. “ది గ్రేటెస్ట్ అఫ్ అల్ టైం” అని చూసిన వాళ్ళు అనాలి… తీసినవాళ్లు కాదు

Comments are closed.