అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణలో ప్రధాని మోదీతో పాటు పాల్గొనేందుకు నరసాపురం ఎంపీ రఘురామకు దారి దొరకడం లేదు. భీమవరంలో జరిగే కార్యక్రమానికి వెళ్లేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో అంతా హ్యాపీ అని రఘు రామ అనుకున్నారు. అయితే అక్కడికి ఎలా వెళ్లాలి? అనేది ఇప్పుడు ప్రశ్న. రోడ్డు మార్గాన వెళితే మాత్రం తనను కొడ్తారని రఘురామ భయం.
ఈ నేపథ్యంలో తన హెలికాప్టర్‌కు ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ లేదా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో ల్యాండింగ్‌కు అనుమతించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ రఘురామకృష్ణరాజు శనివారం అత్యవసరంగా హౌస్ మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం అనుమతి నిరాకరించింది. ఎస్ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ల్యాండింగ్‌కు అంగీకరించినట్టు నిరూపించే ఆధారాలు సమర్పించకపోవడంతో కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. పైగా హెలికాప్టర్ ల్యాండింగ్‌కు అనువైన స్థలం కాదని ఆర్ అండ్‌బీ అధికారులు నివేదిక ఇచ్చినట్టు ప్రభుత్వ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్ స్పందిస్తూ హెలికాప్టర్‌కు అనుమతులు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) మార్గదర్శకాలకు లోబడి ఉంటాయన్నారు. తమ చేతుల్లో ఏమీ ఉండదని అన్నారు. విజయవాడ విమానాశ్రయ అనుమతి, ఫ్లైట్ ప్లాన్‌ను సమర్పించనప్పుడు కలెక్టర్ చేసేదేమీ ఉండదన్నారు.
ప్రభుత్వ న్యాయవాది వివేకానంద స్పందిస్తూ, పిటిషనర్ నిన్న రోడ్డు మార్గం ద్వారా వస్తాను, భద్రత కల్పించాలని కోర్టుకొచ్చారన్నారు. సానుకూల ఉత్తర్వులు రాకపోయేసరికి హెలికాప్టర్‌ను ఎంచుకున్నారని, రేపు షిప్‌లో వస్తానని చెబుతారని వ్యంగ్యంగా అన్నారు.
హెలికాఫ్టర్ దిగే స్థలం యజమాని అనుమతి తప్పనిసరని, అందువల్ల ఆ ప్రాంగణాల్లో ల్యాండింగ్‌పై ఎలాంటి ఆదేశాలు ఇవ్వ లేమని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో భీమవరం ఎలా వెళ్లాలనేది రఘురామకు అంతుచిక్కడం లేదు. పైగా జెడ్ ప్లస్ భద్రత ఉన్న రఘురామ ఎందుకు భయపడుతున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు.
భీమవరం వెళుతున్న రఘురామకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీని హైకోర్టు ఆదేశించింది. శాంతిభ్రదతలకు విఘాతం కలగకుండా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ శనివారం రాత్రి ఉత్తర్వులిచ్చారు.