జ‌న‌సేన హ‌ర్ట్‌!

ఈ నెల 4వ తేదీన ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా భీమ‌వ‌రంలో 30 అడుగులు అల్లూరి సీతారామ‌రాజు కాంస్య విగ్ర‌హావిష్క‌ర‌ణ‌, అనంత‌రం బ‌హిరంగ స‌భ నిర్వ‌హించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి త‌మ నాయ‌కుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను కేంద్ర ప్ర‌భుత్వం ఆహ్వానించ‌క…

ఈ నెల 4వ తేదీన ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా భీమ‌వ‌రంలో 30 అడుగులు అల్లూరి సీతారామ‌రాజు కాంస్య విగ్ర‌హావిష్క‌ర‌ణ‌, అనంత‌రం బ‌హిరంగ స‌భ నిర్వ‌హించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి త‌మ నాయ‌కుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను కేంద్ర ప్ర‌భుత్వం ఆహ్వానించ‌క పోవ‌డంపై జ‌న‌సేన హ‌ర్ట్ అయ్యింది. ఇదే కార్య‌క్ర‌మానికి మెగాస్టార్ చిరంజీవిని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి ప్ర‌త్యేకంగా ఆహ్వానించడం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

అలాగే టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడికి ఫోన్ చేసి పార్టీ ప్ర‌తినిధుల్ని పంపాల్సిందిగా ఆహ్వానించారు. టీడీపీ త‌ర‌పున ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు వెళుతున్నారు. జ‌న‌సేన ప్ర‌తినిధుల‌ను స్థానిక అధికారులు ఆహ్వానించిన‌ట్టు తాజా స‌మాచారం.

బీజేపీతో పొత్తులో ఉన్న ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు ప్ర‌త్యేకంగా ఆహ్వానం అందక‌పోవ‌డంపై జ‌న‌సేన నాయ‌కులు, కార్య‌క‌ర్తలు ఆగ్ర‌హంగా ఉన్నారు. ప‌వ‌న్‌ను అవ‌మానించే త‌ర‌హాలో బీజేపీ నాయ‌క‌త్వం వ‌హిస్తోంద‌ని వారు అనుమానిస్తున్నారు. 

ఒక‌వైపు త‌మ‌తో పొత్తులో ఉంటూనే, మ‌రోవైపు టీడీపీతో అంట‌కాగుతుండ‌డం వ‌ల్లే ప‌వ‌న్‌ను ప‌క్క‌న పెట్టి వుంటార‌ని ఏపీ బీజేపీ నేత‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ప‌వ‌న్‌తో పొత్తుకు టీడీపీ వెన‌క‌డుగు వేయ‌డంతో మ‌ళ్లీ బీజేపీపై మ‌న‌సు మ‌ళ్లింద‌ని ఆ పార్టీ నాయ‌కులు గుర్తు చేస్తున్నారు.

ఏపీ బీజేపీలో ముఖ్య‌మంత్రి స్థాయి అభ్య‌ర్థులెవ‌రూ లేర‌ని జ‌న‌సేన నేత‌లు మాట్లాడుతున్నా, ప‌వ‌న్‌క‌ల్యాణ్ వారించ‌క‌పోవ‌డంపై ఏపీ బీజేపీ ఆగ్ర‌హంగా వుంది. ఇలా అన్నీ తోడై ప‌వ‌న్‌ను ప్ర‌త్యేకంగా ఆహ్వానించ‌కుండా, ఆయ‌న స్థాయి ఏంటో తెలియ‌జెప్పాల‌నే ఉద్దేశంతోనే బీజేపీ వ్యూహాత్మ‌కంగా ప‌క్క‌న పెట్టిందా? అనే ప్ర‌శ్న‌లు ఉద‌యిస్తున్నాయి.

పేరుకు త‌మ‌తో పొత్తు, ప‌వ‌న్ మ‌న‌సంతా చంద్ర‌బాబే అని ఏపీ బీజేపీ నేత‌లు విమ‌ర్శిస్తున్నారు. 14 ఏళ్ల పాటు ముఖ్య మంత్రిగా, అలాగే సుదీర్ఘ కాలం పాటు ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ప‌ని చేసిన చంద్ర‌బాబునే ప్ర‌త్యేకంగా ఆహ్వానించ‌లేద‌ని, అలాంటిది ప‌వ‌న్‌ను ఏ హోదాలో పిల‌వాల‌ని బీజేపీ నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు. 

ప‌వ‌న్ పారద‌ర్శ‌కంగా రాజ‌కీయాలు చేయ‌క‌పోవ‌డం వ‌ల్లే అంద‌రి న‌మ్మ‌కాన్ని కోల్పోతున్నార‌నే అభిప్రాయంతో ఏపీ బీజేపీ ఉంద‌ని నాయ‌కుల మాట‌లు చెబుతున్నాయి.