ఫ‌ర్ ఏ చైంజ్.. అక్క‌డ నుంచి జ‌గ‌న్ పోటీ?

2019 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పులివెందుల నుంచి రాష్ట్రంలోనే రికార్డు స్థాయి మెజారిటీతో విజ‌యం సాధించారు. గ‌తంలో వ‌చ్చిన మెజారిటీ క‌న్నా అధికంగా సాధించి జ‌గ‌న్ రికార్డును స్థాపించారు. అంతే…

2019 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పులివెందుల నుంచి రాష్ట్రంలోనే రికార్డు స్థాయి మెజారిటీతో విజ‌యం సాధించారు. గ‌తంలో వ‌చ్చిన మెజారిటీ క‌న్నా అధికంగా సాధించి జ‌గ‌న్ రికార్డును స్థాపించారు. అంతే కాదు.. పులివెందుల నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైఎస్ కుటుంబానికి ఉన్న అనుబంధం గురించి కూడా వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు. 1978 నుంచి వైఎస్ కుటుంబ‌మే పులివెందుల నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తూ ఉంది. స‌మీప భ‌విష్య‌త్తులో కూడా అది మారే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు. వైఎస్ కుటుంబం అమితాద‌ర‌ణ పొందుతూ పులివెందుల నుంచి త‌మ ప్ర‌స్థానాన్ని అయితే కొన‌సాగించే అవ‌కాశాలకు తిరుగేమీ లేదు.

అయితే వ‌చ్చే సారి చిన్న మార్పు జ‌రిగే అవ‌కాశాలు క‌నిపిస్తూ ఉన్నాయి. వైఎస్ కుటుంబం నుంచి మ‌రొక‌రు పులివెందుల నుంచి పోటీ చేస్తార‌ని, వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌రో నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయ‌బోతున్నార‌నే టాక్ వినిపిస్తోంది. ఈ సారి జ‌గ‌న్ జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా బ‌రిలోకి దిగ‌వ‌చ్చ‌నేది లోక‌ల్ టాక్.

ఏ ర‌కంగా చూసినా.. వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి కుటుంబానికి పులివెందుల త‌ర్వాత అంత‌టి ప‌ట్టున్న నియోజ‌క‌వ‌ర్గం జ‌మ్మ‌ల‌మ‌డుగు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో చెప్పుకోద‌గిన రాజ‌కీయ కుటుంబాలు ఎన్ని ఉన్నా… వైఎస్ కుటుంబానికి స్వ‌యంగా తిరుగులేని బ‌లం ఉంది. పులివెందుల త‌ర్వాత జ‌గ‌న్ కు కూడా గ‌ట్టి ప‌ట్టున్న నియోజ‌క‌వ‌ర్గం జ‌మ్మ‌ల‌మ‌డుగే. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ ఆ నియోజ‌క‌వ‌ర్గంపై దృష్టి సారించార‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌మ్మ‌ల‌మ‌డుగు నుంచి పోటీ చేస్తారనేది లోక‌ల్ టాక్.

వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి డాక్ట‌ర్ గా ప్రాక్టీస్ చేసింది జ‌మ్మ‌ల‌మ‌డుగులోనే. అప్ప‌టి నుంచి ఉన్న అనుబంధం కొన‌సాగుతూ వ‌చ్చింది. గ‌త ఎన్నిక‌ల్లో స్థానికంగా అటు దేవ‌గుడి ఫ్యామిలీ, ఇటు రామ‌సుబ్బారెడ్డి వ‌ర్గం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై వ్య‌తిరేకంగా ప‌ని చేసింది. అయితే… సుధీర్ రెడ్డని నిల‌బెట్టి వైఎస్ జ‌గ‌న్ భారీ మెజారిటీతో గెలిపించుకున్నారు. 

స్థానికంగా రెండు బ‌ల‌మైన వ‌ర్గాలు, ఫ్యాక్ష‌న్ శ‌క్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థికి వ్య‌తిరేకంగా ప‌ని చేసినా.. క‌నీస పోటీ కూడా ఇవ్వ‌లేక‌పోయారు. అది సుధీర్ రెడ్డి వ్య‌క్తిగ‌త బ‌లం అని ఎవ్వ‌రూ అన‌లేరు. వైఎస్ అనే రెండ‌క్ష‌రాల ప్ర‌భావం అది. ఈ క్ర‌మంలో జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ పోటీ చేస్తే.. పులివెందుల‌కు మించిన మెజారిటీ ద‌క్కినా పెద్ద ఆశ్చ‌ర్యం లేదు.

ఇక కుటుంబంలో చోటు చేసుకున్న ప‌లు ప‌రిణామాల‌న్నింటికీ చికిత్స‌గా పులివెందుల నుంచి వైఎస్ సునీత‌ను పోటీ చేయించే ఉద్దేశంతో జ‌గ‌న్ నియోజ‌క‌వ‌ర్గం మారే అవ‌కాశాలు క‌నిపిస్తూ ఉన్నాయి. పులివెందుల నుంచి వైఎస్ సునీత‌కు, క‌డ‌ప ఎంపీగా అవినాష్ రెడ్డికి అవ‌కాశం ఇస్తూ.. ఫ‌ర్ ఏ చైంజ్.. జ‌మ్మ‌ల‌మడుగు నుంచి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పోటీ చేసే అవ‌కాశాలు క‌నిపిస్తూ ఉన్నాయి.