పెద్దాయ‌నే మాంత్రికుడా?

జూలై 3 SV రంగారావు జ‌యంతి. ఆయ‌న‌కి పుట్ట‌డ‌మే తెలుసు. మ‌ర‌ణించ‌డం తెలియ‌దు. తెలుగు సినిమా ఉన్నంత కాలం, మ‌న మ‌ధ్యే వుంటాడు. ఇపుడేతై వాట్సప్‌, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌లు వ‌చ్చి ఎవ‌రి ప్ర‌పంచం వాళ్లు…

జూలై 3 SV రంగారావు జ‌యంతి. ఆయ‌న‌కి పుట్ట‌డ‌మే తెలుసు. మ‌ర‌ణించ‌డం తెలియ‌దు. తెలుగు సినిమా ఉన్నంత కాలం, మ‌న మ‌ధ్యే వుంటాడు. ఇపుడేతై వాట్సప్‌, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌లు వ‌చ్చి ఎవ‌రి ప్ర‌పంచం వాళ్లు జీవిస్తున్నారు. సామూహిక ఆనందం పోయి వ్య‌క్తిగ‌తంగా మారింది. ఎవ‌రి విభ‌జ‌న రేఖ వాళ్లది. 1960-70 మ‌ధ్య‌లో పుట్టిన వాళ్ల‌కి దాదాపు ఒకే ర‌కం జ్ఞాప‌కాలు వుంటాయి. అపుడు పిల్ల‌ల‌కి సినిమా ఒక‌టే వినోదం, ఖ‌రీదైన వినోదం.

చిన్న‌ప్పుడు SV రంగారావు న‌న్ను విప‌రీత‌మైన ఆశ్చ‌ర్యానికి , భ‌యానికి గురి చేసేవాడు. గుండ‌మ్మ‌క‌థ‌లో పెద్దాయ‌న‌ని చూస్తే మా పెద్ద‌నాయ‌న్ని చూసిన‌ట్టు వుండేది. రాయ‌దుర్గం మాజీ ఎమ్మెల్యే శేషాద్రి అలాగే పంచ‌క‌ట్టుతో, భుజం మీద కండువాతో గుర్రం బండి దిగేవాడు. అంద‌రూ అంద‌రికీ దండం పెట్టేవాళ్లు. ఆయ‌న SVRలా, ఎస్వీఆర్ ఆయ‌న‌లా అనిపించేవాడు. పాతాళ‌భైర‌వి చూస్తే SVR చూపు, న‌వ్వు భ‌య‌పెట్టేవి. ఆయ‌న సినిమాలు వ‌రుస‌గా చూసే అదృష్టం నూర్‌టూరింగ్ టాకీస్ అనే టెంట్ క‌లిగించింది.

రాయదుర్గంలో ఒకాయ‌న రెండు తుక్కు ప్రొజెక్ట‌ర్లు ఎలాగో సంపాదించాడు. అంత‌టితో ఆగ‌కుండా నాలుగు రేకులు వేసి, మాసిపోయిన క‌ర్టెన్లు చుట్టి టెంట్ సినిమాగా మార్చాడు. మ‌ర‌క‌ల‌తో నిండిన తెర‌. దాని ముందు నేల‌. ఆడాళ్ల‌ని సెప‌రేట్ చేస్తూ ఒక గోడ. మ‌గాళ్లు బీడీలు తాగుతూ, ఆడాళ్లు ఆకులు వ‌క్క‌లు న‌మిలి అదే నేల మీద ఊస్తూ సినిమా చూసేవాళ్లు. నాలుగు చెక్క ప‌ల‌క‌లు, బ‌హుమేకుల‌తో కూడి బెంచీలుగా మారితే, ఆ సందుల్లో ర‌క్తం రుచి మ‌రిగిన కొన్ని వేల న‌ల్లులు కాపురం చేసేవి. 

ప్రేక్ష‌కులు డ‌బ్బుల‌తో పాటు ర‌క్త‌దానం చేస్తూ సినిమాని ఆనందించేవాళ్లు. బెంచీల వెనుక ఇనుప కుర్చీలు, అది క్లాస్‌. దాని వెనుక ప్రాజెక్ట‌ర్ రూం. అక్క‌డ నీళ్ల‌కి బ‌దులు సారాయి తాగి జీవించే ఒక ఆప‌రేట‌ర్ వుండేవాడు. డోస్ ఎక్కువైన‌ప్పుడు రీళ్ల‌ని అటూఇటూ తారుమారు చేసేవాడు. జ‌నం దాన్ని ప‌ట్టించుకునేవాళ్లు కాదు.

వూళ్లో ఉన్న రెండు థియేట‌ర్ల‌తో పోలిస్తే ఈ టెంట్ పేద‌రాలు. కొత్త సినిమాలు కొనే స్తోమ‌త లేదు. దాంతో పాత సినిమాలే , తెగిపోయిన రీళ్లు ఒక్కోసారి బొమ్మ‌కి బ‌దులు వెన్నెల లాంటి వెలుతురు, అన‌వ‌స‌ర‌మైన గీత‌ల‌తో కూడిన వాన వ‌స్తూ ANRని NTRలా, చూపించేది. కాంతారావు, రాజ‌నాల ఒకేలా క‌నిపించేవాళ్లు.

మా ఇంటికి అతి స‌మీపంలో ఈ టెంట్ వుండ‌డం నా అదృష్టం. టెంట్ డొక్కుదే కానీ, టేస్ట్ గొప్ప‌ది. వ‌రుస‌గా విజ‌యా వాళ్ల క్లాసిక్స్ వేసేవాళ్లు. ఈ వ‌రుస‌లో మొద‌ట చూసింది గుండ‌మ్మ‌క‌థ‌. హీరోల సంగ‌తి ప‌క్క‌న పెడితే SVR హుందాగా భ‌లే వున్నాడు. త‌రువాత మిస్స‌మ్మ‌, అప్పుచేసి పప్పుకూడులో అదే రూపం, అదే కాంతి. మాట గాంభీర్యం. పాతాళ‌భైర‌వి చూసే స‌రికి క‌న్ఫ్యూజ‌న్‌. ఇద్ద‌రూ ఒక‌టేనా? సాహ‌సం సేయ‌రా డింభ‌కా అంటూ ఎన్టీఆర్‌ని మోస‌గిస్తున్నాడు. గుండ‌మ్మ‌క‌థ‌లో అదే హీరోకి తండ్రి. ఆయ‌న్ని ప్రేమించాలా? ద్వేషించాలా?

సినిమాల్లో హీరోలే గెలుస్తార‌ని తెలియ‌ని అమాయ‌క‌త్వంతో మాంత్రికుడు హీరోని చంపేస్తాడ‌ని భ‌య‌ప‌డ్డాను. NTR తెలివిగా మాంత్రికున్నే న‌రికేశాడు. మ‌ళ్లీ బ‌తికి హీరోని క‌ష్టాలు పెడ‌తాడు. అది వేరే సంగ‌తి. SVR అంటే మామూలోడు కాదు అనుకుంటూ వుండ‌గా తుపాన్‌లా అప్పుడొచ్చాడు ఘ‌టోత్క‌చుడు.

మాయాబ‌జార్ గురించి పెద్ద‌వాళ్లు చెబితే విన‌డ‌మే. చూసే స‌రికి క‌ళ్లు తిరిగాయి. ఆ సినిమాలో మా పిల్ల‌ల హీరో ఘ‌టోత్క‌చుడే. ప్రేమ‌, చ‌మ‌త్కారం, పాత్ర‌ల చిత్ర‌ణ అర్థం చేసుకునే వయ‌సు కాదు. అందుకే ఘ‌టోత్క‌చుడు వ‌చ్చే వ‌ర‌కూ సినిమా స్లోగా, బోర్‌గా వుండేది. ANR క‌నిపిస్తే చాలు పాట పాడ‌తాడ‌ని భ‌య‌మేసేది. ఒకసారి SVR వ‌చ్చాడా, ఇక అంతే. ఒక‌వైపు ఒళ్లు గ‌గుర్పాటు, ఇంకో వైపు న‌వ్వులు. వివాహ‌భోజ‌నంబు పాట‌లో ఒక‌టే ఆనందం.

హీరోల సంగ‌తి ప‌క్క‌న పెడితే SVR వుంటే చూడాల‌ని అనిపించేది. కొన్ని సినిమాల్లో ఆయ‌నే హీరో. జ‌గత్ కిలాడీలు, ఇలా జ‌గ‌త్ సిరీస్‌తో కొన్ని వ‌చ్చాయి. గూట్లే, డొంగ్రే అని క్లాస్‌లో తిట్టుకునే వాళ్లం.

“పులి అడ‌విలో ఉన్నా, బోనులో వున్నా పులి పులేరా డోంగ్రే” అనే డైలాగ్ వెరీ ఫేమ‌స్‌. ఆ సినిమాల్లో ఫైట్ చేసి, తుపాకీ కాల్చేవాడు. ఆత్మ‌బంధువు, తాతామ‌నుమ‌డులో ఏడిపించేవాడు. న‌ర్త‌న‌శాల‌లో కీచ‌కుడే హీరో అనించేలా చేసాడు. భ‌క్తి ప్ర‌హ్లాద‌లో తండ్రిగా ఎమోష‌న్‌, రాక్ష‌సరాజుగా క్రౌర్యం ఒకేసారి క‌నిపిస్తాయి. అంద‌రూ దొంగ‌లేలో తాగుబోతుగా న‌వ్విస్తాడు.

దేవుడు చేసిన మ‌నుషులులో తండ్రి, పండంటి కాపురంలో పెద‌నాన్న‌, రామాయ‌ణంలో రాముడు, పాండ‌వ వ‌న‌వాసంలో దుర్యోధ‌నుడు ఇన్ని షేడ్స్‌లో న‌టించిన వాళ్లు అరుదు. ఆయ‌న‌లా న‌టించిన వాళ్లు వున్నారు కానీ, మ‌రిపించిన వాళ్లు లేరు. య‌ముడి పాత్ర వేసాడు కానీ, ఆయ‌న్ని దాట‌లేక‌పోయాడు.

మృత్యువు అంద‌రినీ స‌మానంగా ప్రేమిస్తుంది. క‌మ్యూనికేష‌న్ లేని రోజుల్లో రేడియో వార్త‌లే దిక్కు. ఒక‌రోజు రేడియో SV రంగారావు చ‌నిపోయాడ‌ని చెప్పింది. న‌మ్మ‌బుద్ధికాలేదు.

త‌రువాత య‌శోధా కృష్ణ సినిమాలో ఆయ‌న అంతిమ యాత్ర చూపించారు. కంసుడిగా ఆయ‌న న‌ట‌న చూసి, అంతిమ యాత్ర అబ‌ద్ధం, సినిమా యాత్రే నిజ‌మ‌నిపించింది.

చిత్తూరు జిల్లా పాకాల‌లో ర‌మ‌ణ అనే మిత్రుడున్నాడు. వాళ్ల నాన్న అప్ప‌ట్లో రైల్వేస్కూల్ టీచ‌ర్‌. ఆయ‌న అచ్చం SVRలా వుండేవాడు. నాట‌కాల పిచ్చి. సినిమాలో అదృష్టం ప‌రీక్షించుకుందామ‌ని మ‌ద్రాస్ వెళ్లాడు. అదే స‌మ‌యంలో SVR చ‌నిపోయాడు. అచ్చం అత‌నిలా వున్న ఈయ‌న్ని పెట్టి SVR అసంపూర్తి సినిమాలన్నీ తీశారు. వాటిలో చ‌ల్ల‌ని త‌ల్లి ఒక‌టి.

మ‌ద్రాస్‌లోనే వుంటే టీచ‌ర్ వుద్యోగం పోతుంద‌నే భ‌యంతో ఆయ‌న మ‌ళ్లీ పాకాల వ‌చ్చాడు. మ‌ళ్లీ సినిమాల్లో న‌టించ‌లేదు కానీ, అలా కొన్ని జ్ఞాప‌కాలు మిగిలిపోయాయి.

SVRకి విప‌రీత‌మైన ఆత్మ‌విశ్వాసం. ఒక‌సారి ఒక షాట్‌లో కిరీటం మ‌రిచిపోయార‌ట‌. కంటిన్యుటి మిస్ అవుతుంది, రీటేక్ చేద్దామంటే “స్క్రీన్ పైన SVR వుంటే కిరీటం ఎవ‌డు చూస్తాడురా గూట్లే” అన్నాడ‌ని చెప్పుకుంటారు.

ఆయ‌న‌కి ప్ర‌భుత్వ బిరుదులు రాలేదు. ప్ర‌జ‌లే నెత్తిన పెట్టుకున్నారు. దానికి మించిన గౌర‌వం వుంటుందా? SVR లాంటి వారు శ‌తాబ్దానికి ఒక‌రు పుడ‌తారు. దుర‌దృష్టంకొద్ది తెలుగు వాళ్ల‌లో పుట్టాడు.

జీఆర్ మ‌హ‌ర్షి