భాజపా ఏం చేసినా వెల్ ప్లాన్డ్ గానే చేస్తుంది. అది చంద్రబాబు విషయంలో అయినా మమత బెనర్జీ విషయంలో అయినా. ఒకసారి యుద్దం ప్రారంభించిన తరువాత గెలిచే వరకు ఎత్తుగడలు వేస్తూనే వుంటుంది. కొన్ని సార్లు అవి అంతు పట్టవు కూడా.
చాలా రాష్ట్రాల్లో యుద్దం సాగించిన, సాగిస్తున్న భాజపా ఇప్పుడు తెలంగాణ మీద పూర్తిగా దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. దీనిని తెలంగాణ సిఎమ్ కేసిఆర్ పసిగట్టారా? లేక ఆయనే దీనికి కారణమయ్యారా? అన్నది మాత్రం అంత సులువుగా జవాబు దొరికే ప్రశ్న కాదు. భాజపా మలి మజిలీ తెలంగాణ అని పసిగట్టి, కేసిఆర్ ముందుగా మేల్కొని జాతీయ రాజకీయాల్లో ప్రవేశించారా? లేక కేసిఆర్ ఢిల్లీలో గొంతు విప్పుతున్నారని భాజపా తెలంగాణ మీద కన్నేసిందా? అన్నదే దానికి విస్తరణానువాదం.
నిజానికి భాజపా తెలంగాణ మీద కన్నేయడం ఇవ్వాళ, నిన్నటి వ్యవహారం కాదు. జనసంఘగా వున్నప్పటి నుంచే హైదరాబాద్ లో దాని పట్టు వుంది. దశాబ్దాల క్రితం హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు జరిపించడానికే కాంగ్రెస్ భయపడేది. ఎందుకంటే ఇక్కడ ఎన్నికలు జరిపిస్తే జనసంఘ్/భాజపా గెలుస్తుందని. ఎదో సాకుతో ఏళ్ల తరబడి ఎన్నికలు జరిపించకుండా వున్న సందర్భాలు వున్నాయి.
కానీ రాను రాను పరిస్థితులు మారాయి. చాలా మంది నాయకులు కనుమరుగయ్యారు. భాజపా కు పట్టు వున్నా, బలం మాత్రం హైదరాబాద్ లో తగ్గుతూ వచ్చింది. ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ విభజన జరిగిన కొన్నాళ్ల వరకు కూడా పరిస్థితి మామూలుగానే వుంది. రాను రాను భాజపా క్రమ క్రమంగా విస్తరించడం, పోరాటాన్ని పెంచుతూ వెళ్లడం చేస్తోంది. ఉప ఎన్నికల్లో గెలవడం, కార్పొరేషన్ లో కాస్త చెప్పుకోదగ్గ సంఖ్యలో ఫలితాలు సాధించడం వంటివి ఆ పార్టీ విశ్వాసాన్ని పెంచాయి.
భాజపానే తన ప్రధాన ప్రత్యర్థి అని ప్రకటించడం ద్వారా కాంగ్రెస్ ను కట్టడి చేయవచ్చు అనుకుంటూ, అదే వ్యూహాన్ని అనుసరిస్తూ వస్తున్నారు కేసిఆర్. కానీ ఇది నెగిటివ్ ఫలితాలే ఇచ్చింది తప్ప పాజిటివ్ ఫలితాలు ఇవ్వలేదు.
నిజానికి కాంగ్రెస్ కన్నా భాజపానే బలమైన ప్రత్యర్థి అని కేసిఆర్ భావించడం కరెక్ట్ నే. ఎందుకంటే రేవంత్ రెడ్డిని పక్కన పెడితే తెలంగాణలో కాంగ్రెస్ కు బలమైన నాయకుడు లేరు. వృద్దతరం ఇప్పటికీ పాత విధానాలతోనే, ఒకరి కాళ్లు ఒకరు లాక్కుంటూ వున్నారు. బహుశా ఇవన్నీ గమనించే తనకు ఎప్పటైనా భాజపాతోనే ప్రమాదం అని కేసిఆర్ భావించి వుండొచ్చు. చిన్న పామునైనా పెద్దకర్రతో కొట్టాలన్న పద్దతి ప్రకారం భాజపా మీద కాస్త గట్టిగా ఎగబడే ప్రయత్నం చేసి వుండొచ్చు.
కేసిఆర్ ఆలోచనలు ఇలా వుండగానే భాజపా దృష్టి కూడా తెలంగాణ మీద పడింది. ఒక్కో రాష్ట్రాన్ని గెలుచుకుంటూ లేదా కబ్జా చేస్తూ వస్తున్న భాజపాకు దగ్గరలో అవకాశం వున్న రాష్ట్రంగా తెలంగాణనే కనిపిస్తోంది. అందుకే ఇటు దృష్టి పెట్టింది. ఆంధ్రలో పరిస్థితి వేరు. ముందుగా చంద్రబాబును పూర్తిగా పక్కకు తప్పిస్తే, అప్పుడు జగన్ మీద దృష్టి పెడుతుంది. అందుకే ఈ టెర్మ్ అక్కడ దృష్టి పెట్టడం లేదు.
దక్షిణాది మొత్తం మీద చూసుకుంటే భాజపాకు తెలంగాణనే తమ తక్షణ మజిలీలా కనిపిస్తోంది. అందుకే ఏడాది ముందుగానే యుద్ద భేరీ మోగించింది. కానీ వాస్తవం చెప్పుకోవాలంటే అంతకన్నా ముందుగానే తెలంగాణలో పావులు కదపడం ప్రారంభించింది. కేసిఆర్ కు ఆర్థిక మద్దతు ఇచ్చే వ్యక్తులను, సంస్థలను గుర్తించి కట్టడి చేసే పని ప్రారంభించేసారు. అందులో చాలా వరకు విజయం సాధించేసారు కూడా. ఇవన్నీ పైకి పెద్దగా రాకపోయినా కేసిఆర్ కు తెలియని విషయాలు కాదు. అందుకే తానే ముందుగా యుద్దం ప్రకటించేసారు.
కానీ ఈ యుద్ద కారణాన్ని అర్థం చేసుకోలేని వారు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి లాంటి వాళ్లు భాజపాతో మిలాఖత్ అయిపోయి కేసిఆర్ డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. కానీ ఇప్పటికి ఆయనకు కూడా వాస్తవం బయటపడి వుంటుంది. తెలంగాణ ఎన్నికల పోరులో తమది మూడో ప్లేస్ నే అని. భాజపా ఇప్పుడు ప్రతిపక్షంగా లీడ్ తీసేసుకుంది. జాతీయ సమావేశాలు హైదరాబాద్ లో నిర్వహించడం, మూడు రోజుల పాటు మోడీతో సహా భాజపా అతిరధ మహారధులు ఇక్కడ కూర్చోవడం అంటే మామూలు విషయం కాదు.
తెరాస కూడా అందుకు సిద్దంగానే వుంది. హైదరాబాద్ మొత్తాన్ని తెరాస హోర్టింగ్ లు, ఫ్లెక్సీలతో ముంచెయడం ఓ పక్క తెరాస పాలన సాధించిన విజయాలను వివరించడం, మరోపక్క మోడీ వైఫల్యాలను, తప్పులను ఎత్తి చూపడం అనే ద్విముఖ వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఇది కూడా అంతంత మాత్రంగా సాగించలేదు. దాదాపు ఎన్నికలు జరుగుతున్నాయన్నంత రేంజ్ లో సాగిస్తోంది. కేసిఆర్ మరో అడుగు ముందుకు వేసి హిందీలో ప్రసంగం చేసి, మోడీని పర్సనల్ అటాక్ చేసారు. మోడీకి స్వాగతం పలకకుండా ఎంత టార్గెట్ చేయాలో అంతా చేసారు.
కానీ మోడీ ఎంత కసి మనిషో కేసిఆర్ కు తెలియంది కాదు. అందువల్ల ఈ వైనం అంతా ఎన్నికల పోరును, తెలంగాణ మీద భాజపా దృష్టిని ఎంత పెంచాలో అంతా పెంచుతుంది తప్ప తగ్గించదు. మొత్తానికి అటు భాజపా, ఇటు తెరాస ఎన్నికల యుద్దానికి తెరతీసేసాయి. ఎన్నికలు కూడా ఎంత దూరంలో లేవు. ఏడాది అనగా ఎంత సేపు గడచిపోతుంది. అందులోనూ ఇలా హడావుడి వుంటే మరింత వేగంగా సాగిపోతుంది.
ఇక ఇప్పడు లోకల్..నాన్ లోకల్ రీజన్ కూడా చెల్లదు. ఇప్పుడు నాన్ లోకల్ అంటే కేవలం ఆంధ్ర కాదు..గుజరాతీ, రాజస్థానీ, పంజాబీ లు కూడా. దశాబ్దాల కాలం కిందటి నుంచీ హైదరాబాద్ లో సెటిల్ అయిపోయి, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి, హైదరాబాద్ లో హిందూత్వను బలంగా పట్టుకుని వున్న వాళ్లంతా మోడీకి, భాజపాకు అండగా నిలుస్తారనడం లో సందేహం లేదు. మైనారిటీ ఓటు కూడా ఇక్కడ బలంగానే వుంది. అదంతా కేసిఆర్ బలంగా మారుతుంది.
మొత్తం మీద ఈసారి ఎన్నికల పోరు చాలా రసవత్తరంగా వుంటుంది. డౌటే లేదు.