ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. అయినప్పటికీ ఏబీ వెంకటేశ్వరరావును ప్రభుత్వం పట్టించుకోలేదు. చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఏబీ వెంకటేశ్వరరావు పోషించిన క్రియాశీలక పాత్ర గురించి అందరికీ తెలుసు.
నాడు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడంలో ఏబీ పాత్ర ఉందని ఆ పార్టీ బలంగా నమ్ముతోంది. వైసీపీ అధికారంలోకి రావడంతో ఏబీ వెంకటేశ్వరరావుకు కష్టాలు మొదలయ్యాయి.
ఈ నేపథ్యంలో పలు అవినీతి ఆరోపణల కేసులో ఏబీవీపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. రెండేళ్ల సస్పెన్షన్ గడువు ముగి సింది. నిబంధనల ప్రకారం రెండేళ్ల కంటే ఎక్కువ కాలం సస్పెన్షన్ వేటు వేసే అధికారం లేదని, పోస్టింగ్ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇటీవల ఏబీవీకి అనుకూలంగా తీర్పు వెలువరించింది.
సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు తనను విధుల్లోకి తీసుకోవాలని చీఫ్ సెక్రటరీ సమీర్‌శర్మను ఏబీ వెంకటేశ్వరరావు కలిసి విన్నవించారు.
సానుకూలంగా స్పందించినట్టు ఏబీవీ తెలిపారు. అయితే రెండువారాలు గడిచినా పోస్టింగ్ ఇవ్వకపోవడంతో ఇటీవల మళ్లీ సచివాలయానికి వెళ్లారు. కానీ అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వకుండా సమీర్‌శర్మ వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.
ఇదిలా వుండగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 10 మందికి పైగా ఐపీఎస్‌ల పోస్టింగ్‌ల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. ఇందులో ఏబీ వెంకటేశ్వరరావుకు చోటు దక్కకపోవడం చర్చకు దారి తీసింది. సుప్రీంకోర్టు ఆదేశాలున్నా ఏబీవీకి పోస్టింగ్ ఇచ్చేందుకు ప్రభుత్వం ఏ దైర్యంతో నిరాకరిస్తున్నదో మరి!