మాజీ మంత్రి కింజరాపు కుటుంబంతో వియ్యం అందుకున్న వారు అయిన బండారు సత్యనారాయణమూర్తికి విశాఖ జిల్లాలోని పెందుర్తి టికెట్ రాదు అని ప్రచారం సాగుతోంది. ఆయన టీడీపీలో సీనియర్ రాజకీయ నేత. పైగా ఆయన అల్లుడు శ్రీకాకుళం ఎంపీగా ఉన్న కింజరాపు రామ్మోహన్ నాయుడు. అలా దివంగత ఎర్రన్నాయుడు కుటుంబంతో వియ్యం అందుకున్న బండారుకు ఇపుడు తమ వియ్యాల వారు కీలక స్థానాలలో ఉన్నా టికెట్ కి హామీ దక్కడంలేదు అని అంటున్నారు.
బండారు పెందుర్తి సీటుని ఆశిస్తున్నారు. దాని కోసం ఆయన చాలా కాలంగా పని చేసుకుంటూ వస్తున్నారు. 2009లో పెందుర్తి నియోజకవర్గం ఏర్పడితే అపుడు ఓడిన బండారు 2014లో టీడీపీ తరఫున గెలిచారు. 2019లో మళ్లీ ఓటమి ఆయనను పలకరించింది. 2024లో తనకు టికెట్ ఇస్తే ఈసారి ఎన్నికలతో రాజకీయం ముగిద్దామని ఆయన చూస్తున్నారని అంటున్నారు.
దాని కంటే ముందే జనసేనతో పొత్తుల పేరుతో బండారు సీటుకు ఎసరు వచ్చేలా సన్నివేశం కనిపిస్తోంది అని అంటున్నారు. బండారు ఈ మధ్యనే వైసీపీ మహిళా మంత్రి ఆర్కే రోజా మీద అనుచిత కామెంట్స్ చేసి అధినాయకత్వం మెప్పు పొందాలని చూశారు. అది వర్కౌట్ కాకపోగా బూమరాంగ్ అయింది.
ఈ మధ్యలో వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ జనసేనలో చేరడంతో ఆయనకు పెందుర్తి సీటు హామీగా ఇచ్చారని చెప్పుకున్నారు. ఇపుడు పొత్తుల వేళ మరో మారు అదే ప్రచారం సాగుతోంది. పెంచకర రమేష్ బాబుకు పెందుర్తి టికెట్ ఇస్తే బండారుని సముదాయించి పక్కన పెడతారు అని అంటున్నారు.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా ఏమైనా చేస్తామని హామీ ఇస్తారని అంటున్నారు. 2014లో బండారు ఎమ్మెల్యే అయ్యాక మంత్రి పదవిని ఆశించారు. కానీ అది దక్కలేదు. దాంతో అప్పట్లోనే బాబు మీద ఆయన అలిగిన సందర్భాలు ఉన్నాయి. ఇపుడు పూర్తిగా సీటుకే ఇబ్బంది వస్తోంది.
తాను ఈ దఫా గెలిచి తన కుమారుడి రాజకీయ భవిష్యత్తుకు బాటలు వేయాలని చూస్తున్న ఈ సీనియర్ నేతకు టీడీపీ జనసేన పొత్తు వల్ల షాక్ తప్పేట్లు లేదని అంటున్నారు. ఈ పరిణామాల మీద సీనియర్ నేత ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలని అంటున్నారు.