ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి వైసీపీని వీడేందుకు నిర్ణయించుకుని పెద్దపెద్ద విమర్శలు చేస్తున్నారు. ఐదేళ్ల తొమ్మిది నెలలు అధికారం అనుభవించిన జంగాకు ఇప్పుడు వైసీపీలో సామాజిక సాధికారత నేతి బీరకాయలో నెయ్యి చందంగా కనిపిస్తోందట. బీసీలకు పదవులు తప్ప, అధికారాలు లేవని ఆయన విమర్శించడం గమనార్హం.
బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేసే పరిస్థితి పార్టీలో లేదని ఆయన ఆరోపించారు. ఈ ఆరోపణలు జంగా కాకుండా, ఎలాంటి ప్రయోజనం పొందని వైసీపీ నాయకులు చేసి వుంటే సబబుగా వుండేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
గురజాల ఎమ్మెల్యే స్థానాన్ని జంగా ఆశిస్తున్నారు. అయితే కాసు మహేశ్వరరెడ్డికి కాదని జంగాకు ఇచ్చే పరిస్థితి లేదు. అలాగని జంగాను పట్టించుకోకుండా ఉండే పరిస్థితి లేదు. జంగా కృష్ణమూర్తికి ఎమ్మెల్సీ పదవి, ఆయన ఒక కుమారుడికి జెడ్పీటీసీ, మరో కుమారుడికి సర్పంచ్ పదవుల్ని వైసీపీ కట్టబెట్టింది. వైసీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్ష పదవిని కూడా ఆయనకే ఇవ్వడం విశేషం. ఇంతటితో ఆగలేదు.
జంగా కృష్ణమూర్తికి మైన్స్ కూడా ఇచ్చారు. అలాగే ప్రతినెలా రూ.12 లక్షల ఆదాయం వచ్చేలా సీఎం జగన్ ఏర్పాట్లు చేసినట్టు వైసీపీ పెద్దలు వెల్లడించారు. ఇంత చేసినా, కీలకమైన ఎన్నికల సమయంలో పార్టీకి అండగా నిలబడకపోవడమే ఒక తప్పైతే, నష్టం తెచ్చేలా వ్యవహరించడం జంగా నైజానికి నిదర్శనమంటూ వైసీపీ ముఖ్యులు విమర్శిస్తున్నారు. పోనీ ఇప్పుడాయన టీడీపీలో చేరితే చంద్రబాబు ఏమైనా కిరీటం పెడతారా? అని ప్రశ్నిస్తున్నారు.