వైసీపీకి ఆ పార్టీ కీలక నాయకుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి దూరమైనట్టేనా? అని ప్రశ్నిస్తే… ఔననే సమాధానం అధిష్టానం నుంచి వస్తోంది. నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్‌తో విభేదాలు చివరికి తెగే వరకూ లాగారు. తనతో బాగుంటే చాలు, పార్టీలో నాయకుల ప్రవర్తన ఎలా ఉన్నా పర్వాలేదనే ధోరణి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిలో కనిపిస్తోందనే మాట వినిపిస్తోంది.
వైసీపీకి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచిన వేమిరెడ్డి విషయంలో జగన్, ఆయన చుట్టూ ఉన్న కీలక నేతలు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైసీపీలో సౌమ్యుడిగా వేమిరెడ్డికి మంచి పేరు వుంది. వ్యాపారవేత్త అయిన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఆర్థికంగా సంపన్నుడు. వైసీపీకి ఆర్థిక వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చారు. ఇలాంటి నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత సీఎం జగన్‌తో పాటు వైసీపీ పెద్దలపై వుంది.
రాజ్యసభ సభ్యుడైన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పదవీ కాలానికి కౌంట్ డౌన్ మొదలైంది. వేమిరెడ్డిని నెల్లూరు ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భావించారు. తాను ఎంపీగా పోటీ చేయాలంటే మూడు షరతులు విధించారు. నెల్లూరు, కావలి, ఉదయగిరి ఎమ్మెల్యేలను మార్చాలని జగన్‌కు షరతులు విధించారు. వీరిలో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి పార్టీ నుంచి బయటికి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.
నెల్లూరు ఎమ్మెల్యేను నరసారావుపేట ఎంపీ అభ్యర్థిగా సీఎం నిర్ణయించారు. దీంతో అతని అడ్డంకి తొలగిపోయింది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. నెల్లూరు సిటింగ్ ఎమ్మెల్యే అనుచరుడైన డిప్యూటీ మేయర్ ఖలీల్‌ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం గమనార్హం. నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడితో పాటు ఎంపీ అభ్యర్థి అయిన తనతో మాట మాత్రమైనా చర్చించకుండా, మళ్లీ అనిల్ అనుచరుడిని తీసుకురావడంపై వేమిరెడ్డి మనస్తాపం చెందారు.
పార్టీకి ఆర్థికంగా అండగా నిలబడడంతో పాటు అన్ని రకాలుగా తనను వాడుకుని, అభ్యర్థి ఎంపిక విషయానికి వచ్చే సరికి అవమానించే రీతిలో వైసీపీ అధిష్టానం వ్యవహరించిందని సన్నిహితుల వద్ద ఆయన వాపోతున్నారు. రాజకీయాల నుంచి తప్పుకోడానికైనా, లేదా టీడీపీ నుంచి పోటీ చేయడానికైనా సిద్ధం కానీ, ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీలో కొనసాగే పరిస్థితే లేదని సన్నిహితుల వద్ద ఆయన తెగేసి చెబుతున్నారు. దీంతో వైసీపీకి వేమిరెడ్డి దూరమైనట్టే అనే అభిప్రాయానికి ఆ పార్టీ నేతలు వచ్చారు.