వైసీపీ కార్యకర్తలతో అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ అవుతున్నారంటే…. ఏదో అద్భుతం జరగబోతోందని అందరూ ఆశించారు. మొట్టమొదటగా కుప్పం కార్యకర్తలతో జగన్ భేటీ అయ్యారు. తద్వారా చంద్రబాబును ఓడించాలన్న సంకల్పాన్ని మరోసారి బయటపెట్టుకున్నారు. ఇంత వరకూ బాగానే ఉంది.
కార్యకర్తల భేటీలో వారు చెప్పేదాని కంటే, తాను హితబోధ చేయడానికే జగన్ ప్రాధాన్యం ఇచ్చారు. ఈ మాత్రం దానికి అంత దూరం నుంచి కార్యకర్తలను రప్పించడం ఎందుకనే ప్రశ్న వినిపిస్తోంది. 9 సంవత్సరాల పాటు పార్టీని భుజాన మోసి అధికారం లోకి తెచ్చుకున్నామని, ఇప్పుడు తమకేమీ మేలు జరగలేదనే ఆవేదన వైసీపీ కార్యకర్తల్లో వుంది. అసలు కార్యకర్తల్లో అసంతృప్తికి కారణం ఏంటో వైఎస్ జగన్ తెలుసుకుంటారని అనుకున్నారు.
అలాగే నవరత్నాల సంక్షేమ పథకాలను పక్కాగా అమలు చేస్తున్నప్పటికీ ప్రజల్లో ప్రభుత్వంపై అసంతృప్తికి కారణం ఏంటో జగన్ అడిగి తెలుసుకుంటారని అంతా భావించారు. కానీ అలాంటివేవీ కుప్పం నియోజకవర్గ వైసీపీ కార్యకర్తల భేటీలో జరగలేదు. దీంతో ఊరించి ఉస్సూరుమనిపించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యేల భేటీలో 175కు 175 స్థానాల్లో పార్టీ గెలవాలని దిశానిర్దేశం చేసినట్టుగానే కార్యకర్తల సమావేశంలోనూ అదే మాటను మరోసారి జగన్ బలంగా చెప్పారు.
తమతో జగన్ భేటీ ఉద్దేశం ఏంటో అర్థం కావడం లేదని కుప్పం వైసీపీ కార్యకర్తలు వాపోతున్నారు. తమ గోడు వినిపించాలని వెళ్లామని, చివరికి ఆయన చెప్పింది వినడానికే సరిపోయిందని వారు అంటున్నారు. మిగిలిన 174 నియోజకవర్గాల కార్యకర్తలతో భేటీ ఎలా ఉండనుందో ఈ ఒక్క మీటింగ్‌తో తేలిపోయిందని, ఇక వెళ్లడం దేనికనే ప్రశ్నలు వైసీపీ శ్రేణుల నుంచి వెల్లువెత్తుతున్నాయి.
ఇదంతా టైం వేస్ట్ వ్యవహారంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కుప్పం నియోజకవర్గాన్ని తన సొంత నియోజక వర్గంగా భావిస్తానని, కార్యకర్తలకు కష్టసుఖాల్లో తోడు, నీడగా ఉంటానని జగన్ భరోసా ఇవ్వడం. సొంత నియోజకవర్గమైన పులివెందులలో తమకు దిక్కులేదని రెండు రోజుల క్రితం వైసీపీ నాయకులు, కార్యకర్తలు సీఎం కార్యాలయానికి వెళ్లి గొడవ చేసిన సంగతి తెలిసిందే.
కుప్పంలో భరత్‌ను గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తాననే హామీ. కుప్పం మున్సిపాలిటీకి రూ.65 కోట్ల పనులు మంజూరు చేస్తానని హామీ ఇవ్వడం అభినందనీయం. ఇంతకు మించి వైసీపీ కార్యకర్తల కష్టనష్టాల గురించి జగన్ అడిగి తెలుసుకున్న పాపాన పోలేదని అంటున్నారు. మొత్తానికి కార్యకర్తలతో మొదటి భేటీనే తుస్సుమనిపించింది.