ఎన్టీఆర్, వైఎస్సార్… ఇద్దరూ రాజకీయ ఉద్ధండులే. ప్రజాదరణలో ఎవరికి వారే సాటి. ఎన్టీఆర్ సినీ రంగం నుంచి రాజకీయాల్లో వచ్చారు. ప్రజావైద్యుడిగా పులివెందులలో సేవా రంగం నుంచి వైఎస్సార్ రాజకీయాల్లో ప్రవేశించారు. వైఎస్సార్ పూర్తిగా రాజకీయాన్ని ఒంటబట్టించుకున్న నాయకుడు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఇద్దరూ తమ పాలనలో సంక్షేమానికి, రైతులకు పెద్దపీట వేశారు.
ఎన్టీఆర్ పేరు చెబితే రూపాయికే బియ్యం, పాలనా సంస్కరణలు గుర్తుకొస్తాయి. ఇక వైఎస్సార్ పేరు చెబితే సాగునీటి ప్రాజెక్టులు, ఉచిత విద్యుత్, ఫీజురీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, కుయ్ కుయ్‌మంటూ వచ్చే 108 అంబులెన్స్… ఇలా ఎన్నో పథకాలు కళ్ల ముందు మెదలుతాయి. ఇప్పుడు వాళ్లిద్దరి పేర్ల కేంద్రంగా రాజకీయ జగడం మొదలైంది.
విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా పేరు మారుస్తూ జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పేరు మార్పు సవరణ బిల్లును ఇవాళ అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నారు. 1998లో చంద్రబాబు హయాంలో ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా అవతరించింది. ఆ తర్వాత వైఎస్సార్ హయాంలో 2006, జనవరి 8న డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా నామకరణం చేశారు.
ఇప్పుడు ఆ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి తన తండ్రి డాక్టర్ వైఎస్సార్ పేరు మార్చుతూ సీఎం జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీన్ని టీడీపీ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆరోగ్య విశ్వవిద్యాలయంతో ఏ సంబంధం లేని వైఎస్సార్ పేరు పెట్టడం ఏంటని ప్రధాన ప్రతిపక్షం నిలదీస్తోంది. మరోవైపు కృష్ణా జిల్లాను విడగొట్టి ఎన్టీఆర్ పేరు పెట్టి, ఆయనపై అభిమానం ప్రదర్శించినట్టు నటించారని విమర్శిస్తున్నారు. ఇప్పుడేమో ఏకంగా ఆయన పేరునే లేకుండా చేయడం దేనికి సంకేతమని టీడీపీ ప్రశ్నిస్తోంది.
డాక్టర్ వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ పేరును తాము మార్చలేదని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. అలాగే కాంగ్రెస్ హయాంలో ఏనాడూ ఎన్టీఆర్ పేరు మార్చాలని ఆలోచించలేదని, పైగా జగన్ తండ్రి వైఎస్సార్ గౌరవంగా డాక్టర్, ఆరోగ్య లాంటి పదాలను జోడించి, ఆ మహానేత ఔన్నత్యాన్ని పెంచారని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఎన్టీఆర్ పేరు మార్పుపై తీవ్రంగా పోరాడుతామని హెచ్చరిస్తున్నారు.