ఆంధ్రాకు పొరుగున ఒడిషా ఉంది. రాష్ట్రాల విభజనలో కొన్ని జిల్లాలు ఒడిషాలో ఏనాడో కలిశాయి. అక్కడ తెలుగు మాట్లాడేవారు ఉన్నారు. ఇలా రాష్ట్రాల సరిహద్దులలోని శివారు ప్రాంతాలకు చెందిన వారు అటూ ఇటూ ఉన్నారు. అయితే వారిని ఏ వైపున ఉంటారు అని ఐచ్చికంగా వారి అభిప్రాయం తీసుకుని వదిలేయాలి.
కానీ ఒడిషా రాజకీయ నాయకులు అక్కడి ప్రభుత్వం కట్టడి చేస్తూ ఆంధ్రా రాజకీయాల్లో చిచ్చు పెడుతోందని అంటున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు నియోజకవర్గంలోని కొటియా గ్రామాలు ఉన్నాయి. ఇవి ఇరవై దాకా ఉన్నాయి. ఈ గ్రామాలలో ఉండే గిరిజనులు మీ ముఖ్యమంత్రి ఎవరు అంటే జగన్ అని ఠక్కున చెబుతారు. ఏపీలోనే తాము ఉంటామని, తమకు ఏపీ సంక్షేమ పధకాలు కావాలని వారు కోరుతారు.
అయితే శివారు గ్రామాలైన వీటిని ఒడిషా తమలో కలుపుకోవాలని చూస్తోంది. వారు ఒప్పుకుంటే అది ఏనాడో జరిగిపోయేది. కానీ వారు ససేమిరా అంటున్నారు. తాము ఆంధ్రాలోనే ఉంటామని పట్టుబడుతున్నారు. దాంతో రాజకీయ ప్రాబల్యాన్ని చూపిస్తూ ఈ గ్రామాలలోకి ఆంధ్రా అధికారులను రానీయకుండా అడ్డుకుంటూ ఒడిషా రాజకీయం చేస్తోందని లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ ఆరోపిస్తున్నారు.
వీరికి సంక్షేమ పధకాలు అందించాలని ఐటీడీయే అధికారులు కొటియా గ్రామలకు వెళ్ళినా వారిని సైతం రానీయకుండా చేస్తూ తమ రాజకీయ ఆధిపత్యాన్ని చూపిస్తున్నారు అని ఆయన విమర్శించారు. ఒడిషాలో ఈ గ్రామాలను కలిపేసుకోవాలని చూస్తున్నా కొటియా గ్రామస్తులు మాత్రం ఏపీయే తమకు కావాలని పోరాడుతున్నారని ఆయన అంటున్నారు. ఒడిషాలోని మంత్రులు అధికారులు అంతా కూడా కొటియా గ్రామాల మీద అనవసరం పెత్తనం చేస్తున్నారని, వారి మానాన వారిని వదిలేస్తే ఏపీలో వారుంటారని ఆయన సూచించారు.
ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం కూడా కలుగచేసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఎనిమిది నెలల క్రితం ఒడిషా వెళ్ళి నవీన్ పట్నాయక్ తో ఏపీ సీఎం జగన్ సమావేశం అయ్యారు రెండు రాష్ట్రాల మధ్యన ఉన్న అనేక సరిహద్దు సమస్యలతో పాటుగా కొటియా గ్రామాల విషయాన్ని ఆయన ప్రస్థావించారు. దాని మీద రెండు రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ కమిటీని అధికారులతో నియమించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించాయి. కానీ ఈ రోజుకీ కొటియా గ్రామ సమస్యలతో పాటు ఒడిషాతో ఉన్న అనేక సరిహద్దు సమస్యలు అలాగే ఉండిపోయాయి.
ముఖ్యంగా మా సీఎం జగన్ అని అంటున్న కొటియా గ్రామస్తుల విషయంలో ఏపీ సర్కార్ దృష్టి పెట్టి ఒడిషాతో కూర్చుని వ్యవహారం సెటిల్ చేయాలని అంతా కోరుతున్నారు.