సార్వత్రిక ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉన్న నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు యాక్టీవ్ అయ్యాయి. ఈడీ తర్వాత ప్రధాని మోదీ వస్తారని ఇటీవల ఎమ్మెల్సీ కవిత సెటైర్ వేసిన సంగతి తెలిసిందే. ఆమె అన్నట్టుగానే ఈడీ కాకుంటే ఐటీ, అది లేదంటే సీబీఐ ప్రత్యర్థులపై దాడులకు సిద్ధంగా ఉన్నాయి. మొన్నటి వరకూ తెలంగాణకే పరిమితమైన కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు… ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌పై కూడా దృష్టి సారించాయి.
త్వరలో టీడీపీ సీనియర్ నేతపై ఐటీ పంజా విసరనున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన ఆ టీడీపీ నాయకుడు తెలంగాణకు చెందిన కీలక నేతతో వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్నట్టు బీజేపీ గ్రహించింది. హైదరాబాద్ శివారులోని బుద్వేల్‌లో సదరు టీడీపీ నాయకుడు ఏకంగా రూ.1400 కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని తెలంగాణ కీలక మంత్రి ప్రోత్సాహంతో చేస్తున్నట్టు సమాచారం.
మరీ ముఖ్యంగా తెలంగాణ మంత్రితో స్నేహ బంధాల్ని వాడుకుని, దళితుల భూముల్ని అప్పనంగా కొట్టేసినట్టు తెలిసింది. దీని విలువ రూ.1400 కోట్లు అని ఐటీ అధికారులు లెక్కలేసినట్టు తెలిసింది. సదరు టీడీపీ నాయకుడు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన ఓ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా కొనసాగుతున్నారు.
సదరు టీడీపీ నాయకుడిని అడ్డం పెట్టుకుని తెలంగాణ కీలక మంత్రి బాగా సంపాదిస్తున్నట్టు ఐటీ అధికారులు పక్కా ఆధారాలు సంపాదించారని సమాచారం. ఐటీ దాడులు కేవలం ఇతనికే పరిమితం చేయరని, తీగ లాగడం వెనుక తెలంగాణలో పెద్ద నాయకుడి డొంక కదిలించే ఎత్తుగడ ఉందని తెలిసింది.