జాతీయ పార్టీ అన్న తర్వాత జాతీయ విధానాలుంటాయి. అదేంటో గానీ బీజేపీకి మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు రకాల వైఖరులున్నాయి. ఏపీలో మాత్రం జనసేనాని పవన్‌కల్యాణ్ ముద్దు అంటోంది. తెలంగాణకు వెళితే పవన్ వద్దని అక్కడి బీజేపీ నేతలు తేల్చి చెబుతున్నారు. పవన్‌కల్యాణ్‌పై తాజాగా బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు లక్ష్మణ్ ఆసక్తికర విషయాలు చెప్పారు.
తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం జనసేనాని పవన్‌కల్యాణ్‌తో కలిసి బీజేపీ పోటీ చేస్తుందని తేల్చి చెప్పారు. ఏపీలోనూ తమ పార్టీ బలం రోజురోజుకూ పెరుగుతోందని చెప్పుకొచ్చారు. తెలంగాణలో జనసేనాని పవన్‌కల్యాణ్‌కు అంత సీన్ లేకపోవడంతో ఆయన్ను బీజేపీ పట్టించుకోలేదని స్పష్టమైంది. తెలంగాణలో పవన్ అభిమానులున్నప్పటికీ, రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయిలో లేరనేది బీజేపీ భావన.
గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థికి పవన్ మద్దతు ఇచ్చారు. అలాగే గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తామని పవన్‌కల్యాణ్ ఊగిపోయారు. అప్పుడు కూడా వెనక్కి తగ్గారు. తెలంగాణలో కొన్ని సీట్లలో పోటీ చేస్తామని ఇటీవల పవన్‌కల్యాణ్ ఆంధ్రా పర్యటనలో చెప్పారు.
ఈ నేపథ్యంలో పవన్‌కల్యాణ్ అవసరమే లేదని లక్ష్మణ్ పరోక్షంగా చెప్పారు. ఏపీలో మాత్రం ఆయన సామాజిక వర్గం కొంత వరకూ బలంగా వుండడంతో పొత్తు కొనసాగిస్తోందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తద్వారా పవన్‌పై అభిమానంతో కాదని, ఆయన అభిమానులు, కులం ఓట్ల కోసమో బీజేపీ ప్రేమ నటిస్తోందని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు.
ఏపీలో వాడుకుంటూ, తెలంగాణలో మాత్రం వద్దంటున్న బీజేపీ వైఖరిపై పవన్ ఏమంటారో అనే చర్చకు తెరలేచింది.